భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ‘రామాయణం’ (Ramayana) షూటింగ్ సెట్‌లో (Shooting Set) అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. షూటింగ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చిత్రబృందంలో ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (Federation of Western India Cine Employees – FWICE) అధ్యక్షుడు బి.ఎన్. తివారీ (B.N. Tiwari) మాట్లాడుతూ.. స్టూడియో బయట ఏర్పాటు చేసిన ఓ చిన్న టెంట్‌లో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.
ఇటీవల సమీపంలోని మరో ప్రాంతంలోనూ అగ్నిప్రమాదం జరగడంతో షూటింగ్ సెట్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని నిర్మాతలకు సూచించినట్లు తివారీ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ‘రామాయణం’ రెండో భాగం షూటింగ్ కొనసాగుతోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో దర్శకుడు లేదా రణ్‌బీర్ కపూర్ సెట్‌లో ఉన్నారా? అనే దానిపై స్పష్టత లేదు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రముఖ అమెరికన్ యూట్యూబర్(American YouTuber) మిస్టర్ బీస్ట్(MrBeast) ‘రామాయణం’ షూటింగ్ సెట్‌ను సందర్శించడం కూడా వైరల్‌గా మారింది. దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారత్‌లో(India) నవంబర్ 8న, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5, 6 తేదీల్లో ప్రాంతాల వారీగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.







