తెలంగాణలో ఓటర్ల జాబితా (Voters List) ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (Special Intensive Revision-SIR) కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు ఎన్నికల సంఘం(Election Commission-EC)) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం అధికారులు నిర్వహించిన పరిశీలనలో కొందరి వివరాల్లో వ్యత్యాసాలు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఓటర్ల పేర్లు గత రికార్డులతో సరిపోలకపోవడం, తండ్రి పేర్లలో తప్పులు ఉండటం, గత ప్రత్యేక సమగ్ర సవరణ రికార్డులతో ప్రస్తుత వివరాలు సరిపోకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. కొన్ని నోటీసుల్లో మాత్రం వాటిని జారీ చేయడానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొనలేదని తెలుస్తోంది.
సినీ రంగానికి చెందిన ప్రముఖుల్లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), హీరో మహేష్ బాబు(Mahesh Babu), ఆయన భార్య నమ్రత శిరోద్కర్, నటుడు వెంకటేష్ దగ్గుబాటి(Venkatesh Daggubati), ఆయన కుమార్తెల పేర్లు ఉన్నట్లు సమాచారం. నటి సమంత, నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండలకు(Anand Deverakonda) కూడా నోటీసులు అందినట్లు తెలుస్తోంది.
క్రీడా రంగం నుంచి మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman), మిథాలీ రాజ్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పేర్లు కూడా నోటీసుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. వ్యాపార రంగానికి చెందిన మురళీకృష్ణ ప్రసాద్ దివి, ఉపాసన కొణిదెల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ కావడంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. అయితే నోటీసులు జారీ చేయడం ద్వారా ఓటు హక్కుపై తుది నిర్ణయం తీసుకున్నట్లు కాదని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. సంబంధిత వ్యక్తుల నుంచి వివరణలు, అవసరమైన ఆధారాలు స్వీకరించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేని వారు తమ తరఫున ప్రతినిధిని పంపేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగతంగా హాజరయ్యే వారు తమ వద్ద ఉన్న ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించి, ఓటరు వివరాల్లో ఉన్న తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.








