ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పారిశ్రామిక రంగానికి (Industrial Sector) మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన వెబ్ సోల్ ఎనర్జీ సిస్టమ్‌కు (Websol Energy System) చెందిన రూ.3,538 కోట్ల భారీ సోలార్ తయారీ ప్రాజెక్టు (Solar Manufacturing Project) ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌కు(West Bengal) తరలిపోనున్నట్లు వెల్లడైంది. ఈ నిర్ణయం ఏపీ పెట్టుబడి వాతావరణం, పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ మద్దతుపై కొత్త చర్చకు దారితీస్తోంది.
వెబ్ సోల్ రిన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Websol Renewables Private Limited) తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీఎస్ఈజెడ్ (MSEZ) పరిధిలో 8 గిగావాట్ల సామర్థ్యంతో భారీ గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ తయారీ కేంద్రాన్ని (Greenfield Integrated Solar Manufacturing Facility) ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించింది. ఇందులో 4 గిగావాట్ల సోలార్ సెల్స్, 4 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రూ.3,538 కోట్ల పెట్టుబడితో అమలు కావాల్సిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు.
నవంబర్ 15, 2025న ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో(AP Economic Development Board) అవగాహన ఒప్పందం కుదిరిన అనంతరం, జనవరి 2026లో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. అయితే ఆగస్టు 19, 2026న జరిగిన క్యూ1 ఇన్వెస్టర్ల సమావేశంలో వెబ్ సోల్ యాజమాన్యం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్‌కు తరలించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
పశ్చిమ బెంగాల్లో మరింత అనుకూలమైన తయారీ వాతావరణం, తక్కువ భూఖర్చులు అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామం ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు కల్పిస్తున్న భరోసాపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇప్పటికే టాటా పవర్(Tata Power), హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్, ఆజాద్ ఇండియా మొబిలిటీ, జ్యూపిటర్ రిన్యూవబుల్ ఎనర్జీ, జిన్ఫ్రా ప్రెసిషన్స్, ఐస్పేస్ టెక్నాలజీస్ వంటి సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చ కొనసాగుతోంది. వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్లగా, మరికొన్ని ప్రతిపాదనలు ఉపసంహరించుకున్నట్లు వార్తలు రావడం ఏపీ పారిశ్రామిక పరిస్థితిపై విమర్శలకు దారితీస్తోంది.
గతంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో(Ease of Doing Business) ముందంజలో నిలిచిన ఆంధ్రప్రదేశ్, కూటమి పాలనలో ఇటీవల నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్‌లో(NITI Aayog Investment Friendliness Index) 8వ స్థానానికి పడిపోయిందనే అంశం కూడా ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రకటిస్తున్న భారీ పెట్టుబడులు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయి? ఇప్పటికే ఒప్పందాలు కుదిరిన ప్రాజెక్టులను రాష్ట్రంలోనే నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రూ.3,538 కోట్ల వెబ్ సోల్ ప్రాజెక్టు తరలింపు కేవలం ఒక పరిశ్రమ నిర్ణయంగానే కాకుండా, ఏపీ పారిశ్రామిక విధానాలపై మరోసారి సమీక్ష అవసరాన్ని గుర్తు చేస్తున్న పరిణామంగా మారింది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన భారీ ప్రాజెక్టులను నిలబెట్టుకోవడం కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కూటమి పాలనలో ఆరాచకం పెచ్చుమీరి పరిశ్రమలపై వేదింపులు పెరిగిపోయాయని దాని ఫలితమే ప్రముఖ పారిశ్రామికవేత్తలు సైతం రాష్ట్రానికి ముఖం చాటేస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.







