---Advertisement---

నల్లమలలో 22 పులులు ఎక్కడ? వరుస మరణాలతో కలకలం.. అటవీశాఖపై పెరుగుతున్న విమర్శలు.

August 12, 2026

Summarize with AI

---Advertisement---

నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో 22 పులులు కనిపించకపోవడం, ఇటీవలి కాలంలో వరుసగా పులుల మరణాలు చోటుచేసుకోవడం, అక్రమ వేటపై ఆరోపణలు వెల్లువెత్తడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. దేశ జాతీయ జంతువైన పులుల సంరక్షణ విషయంలో అటవీశాఖ వ్యవహరిస్తున్న తీరుపై క్షేత్రస్థాయిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రపంచంలోని పులుల జనాభాలో దాదాపు 75 శాతం భారత్‌లోనే ఉండగా, ప్రాజెక్ట్ టైగర్ వంటి కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం వాటి సంరక్షణకు చర్యలు చేపడుతోంది. అయితే దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా పేరున్న నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. 2022 అఖిల భారత పులుల అంచనా, 2023–24 అనధికారిక లెక్కింపుల్లో కెమెరా ట్రాప్‌లకు చిక్కిన 22 పులులు.. తాజా 2026 లెక్కింపులో ఒక్కసారి కూడా కెమెరాలకు చిక్కకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ పులులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయా? లేక అక్రమ వేటగాళ్ల బారిన పడ్డాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడం ఆందోళనను మరింత పెంచుతోంది.

మరోవైపు కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఐదు పులులు మృతి చెందడం, జూలై చివర్లో నందికొట్కూరు, మార్కాపురం రాచర్ల బీట్లలో వరుసగా మూడు రోజుల వ్యవధిలో పులుల మృతదేహాలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. గతంలోనూ పులుల మరణాలకు సంబంధించి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025 సెప్టెంబరులో ఆత్మకూరు డివిజన్‌లో ఉచ్చులో చిక్కి మృతి చెందిన ఆడపులిని నిబంధనలకు విరుద్ధంగా దహనం చేయడం, 2021లో కరెంట్ షాక్‌తో మృతి చెందిన పులి మరణాన్ని నీటిలో మునిగి చనిపోయినట్లుగా చూపించారనే ఆరోపణలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

పులికి ఉండే 18 గోళ్లకు అక్రమ మార్కెట్‌లో భారీ ధర పలుకుతుందనే ప్రచారం కూడా అక్రమ వేటపై అనుమానాలను పెంచుతోంది. తాయెత్తులు, ఆభరణాల తయారీ, మూఢనమ్మకాలు, స్టేటస్ సింబల్స్‌తో పాటు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాల ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలతో 2018లో 48గా ఉన్న పులుల సంఖ్య 2022 నాటికి 58కు, 2024 నాటికి 87కు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో అటవీశాఖ పనితీరుపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని శాఖపై విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

గత రెండేళ్లలో నలుగురు ఫీల్డ్ డైరెక్టర్లు మారడం, రాజకీయ ఒత్తిళ్ల ప్రభావం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 3,467 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ అటవీ ప్రాంతాన్ని సమర్థంగా రక్షించేందుకు సుమారు 750 మంది సిబ్బంది అవసరముండగా, ప్రస్తుతం కేవలం 250 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారనే వాదన నిఘా వ్యవస్థపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పులుల అదృశ్యం, వరుస మరణాలు, అక్రమ వేటపై అనుమానాలు, సిబ్బంది కొరత వంటి అంశాల నేపథ్యంలో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణి సంరక్షణ వ్యవస్థపై సమగ్ర విచారణ, పారదర్శక లెక్కింపు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment