గూగుల్ (Google, ఆల్ఫాబెట్ (Alphabet) సీఈఓ(CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai) స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం 2026 పట్టభద్రుల వేడుకలో కీలక ప్రసంగం చేస్తుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది విద్యార్థులు (Students) వేడుక మధ్యలోనే బయటకు వెళ్లిపోవడం సంచలనంగా మారింది. కొందరు విద్యార్థులు పాలస్తీనా (Palestine) జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (Stanford University) నిర్వహించిన ఈ గ్రాడ్యుయేషన్ వేడుకకు (Graduation Ceremony) సుందర్ పిచాయ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన వేదికపైకి వచ్చిన వెంటనే సుమారు 100 నుంచి 200 మంది విద్యార్థులు తమ సీట్ల నుంచి లేచి “ఫ్రీ పాలస్తీన్”(Free Palestine) అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్టేడియం నుంచి వాకౌట్ చేశారు. కొందరు విద్యార్థులు విజిల్స్ ఊదుతూ, పాలస్తీనా సంప్రదాయ కెఫీయాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసనలకు ప్రధాన కారణంగా గూగుల్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఉన్న “ప్రాజెక్ట్ నింబస్”(Project Nimbus) ఒప్పందాన్ని విద్యార్థి సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. గూగుల్, అమెజాన్ సంస్థలు కలిసి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి క్లౌడ్(Cloud), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) సేవలు అందించేందుకు 1.2 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి నిరసనలు కొనసాగుతున్నాయి.
విద్యార్థులు నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయినా సుందర్ పిచాయ్ తన ప్రసంగాన్ని ఆపలేదు. స్టాన్‌ఫోర్డ్‌లో చదివిన రోజులు, తన జీవిత ప్రయాణం, ఆశావాద దృక్పథం, భవిష్యత్ నిర్ణయాల ప్రాముఖ్యత గురించి పట్టభద్రులకు సూచనలు చేశారు. మార్పులను అవకాశాలుగా స్వీకరించాలని, జీవితంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈసారి తన ప్రసంగంలో పిచాయ్ ఏఐ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నాలజీ కంటే జీవిత విలువలు, నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలపైనే ఆయన ఎక్కువగా మాట్లాడారు.
భారతదేశంలోని చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మెటీరియల్స్ సైన్స్‌లో (Materials Science) మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం గూగుల్‌లో చేరి గూగుల్ క్రోమ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థలకు సీఈఓగా కొనసాగుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా-ఇజ్రాయెల్ (Palestine-Israel) అంశంపై విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలో నిరసనలు కొనసాగుతున్న సమయంలో స్టాన్‌ఫోర్డ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కూడా అదే ఉద్యమంలో భాగంగా మారింది. నిరసనలు జరిగినప్పటికీ పట్టభద్రుల వేడుకలు యథావిధిగా కొనసాగాయి.








