ఇథియోపియాలో (Ethiopia) మరోసారి విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర అంహారా ప్రాంతంలో (North Amhara Region) ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న ఓ బస్సు(Bus) అదుపుతప్పి లోయలో (Valley) పడిపోయిన ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. డెస్సీ (Dessie) ప్రాంతం నుంచి రాజధాని అడిస్ అబాబాకు (Addis Ababa) బయలుదేరిన బస్సు సోమవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ప్రయాణం మధ్యలో డ్రైవర్ (Driver) నియంత్రణ కోల్పోవడంతో బస్సు రహదారి నుంచి పక్కకు దూసుకెళ్లి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడికక్కడే పలువురు మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో సరైన మౌలిక వసతులు, అత్యవసర అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరు సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బాధితులను ప్రజా రవాణా వాహనాల్లో సమీప ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ప్రమాదం జరిగిన రహదారి కొండ ప్రాంతాల గుండా సాగుతూ ప్రమాదకర మలుపులతో ఉండటంతో ఇప్పటికే ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
ఇదే తరహాలో 2024 డిసెంబర్‌లో ఇథియోపియాలోని (Ethiopia) దక్షిణ సిడామా ప్రాంతంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో బస్సు నదిలో పడిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. వరుస ప్రమాదాలు ఇథియోపియాలో రహదారి భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి.








