నీట్ యూజీ 2026(NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్‌కు (Re-Examination) ముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి తీవ్ర విమర్శలకు గురైంది. జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్ టికెట్లు (Hall Tickets) విడుదల చేసిన అనంతరం, మహారాష్ట్రలోని (Maharashtra) నాగపూర్‌కు చెందిన ఒక విద్యార్థికి ఏకంగా యూఏఈలోని(UAE) అబుదాబిలో (Abu Dhabi) పరీక్షా కేంద్రాన్ని (Examination Centre) కేటాయించడం సంచలనంగా మారింది. పరీక్షకు కేవలం కొద్ది గంటల ముందు ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
నాగపూర్‌కు చెందిన అబ్దుల్లా (Abdullah) అనే విద్యార్థి మొదటి దశ నీట్ పరీక్షను తన స్వస్థలంలోనే రాశాడు. రీ-ఎగ్జామ్ కోసం దరఖాస్తు సమయంలో కూడా నాగపూర్, వార్ధా, భండారా ప్రాంతాలను మాత్రమే తన ప్రాధాన్య పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసుకున్నాడు. అయితే ఎన్‌టీఏ(NTA) విడుదల చేసిన అడ్మిట్ కార్డులో మాత్రం అతనికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబి పరీక్షా కేంద్రంగా చూపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
తాము దరఖాస్తులో స్థానిక పరీక్షా కేంద్రాలనే ఎంపిక చేసినప్పటికీ విదేశంలోని పరీక్షా కేంద్రాన్ని ఎలా కేటాయించారో అర్థం కావడం లేదని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల పరీక్ష రాసే అవకాశమే ప్రమాదంలో పడిందని ఆయన తెలిపారు.
ఈ ఘటనను మరింత క్లిష్టంగా మార్చిన విషయం ఏమిటంటే అబ్దుల్లా వద్ద పాస్‌పోర్ట్(Passport) కూడా లేకపోవడం. పరీక్షకు ముందు ఉన్న స్వల్ప సమయంలో పాస్‌పోర్ట్, వీసా (Visa) ప్రక్రియలు పూర్తి చేసి విదేశాలకు వెళ్లడం సాధ్యం కాని పరిస్థితి. దీంతో పరీక్ష రాయలేకపోతానేమోనన్న భయం విద్యార్థిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసింది.
ఈ ఘటనపై మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ (Congress) నాయకుడు డాక్టర్ అనీస్ అహ్మద్ (Dr. Anees Ahmed) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టీఏ పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న లోపాలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆయన విమర్శించారు. వెంటనే సవరించిన అడ్మిట్ కార్డు (Admit Card) జారీ చేసి విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ తప్పిదం వెలుగులోకి వచ్చిన వెంటనే విద్యార్థి కుటుంబం ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అధికారులు సాంకేతిక లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని అంగీకరించారు. త్వరలోనే సరిచేసిన హాల్ టికెట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే కొత్త అడ్మిట్ కార్డు అందే వరకు విద్యార్థి కుటుంబం తీవ్ర ఆందోళన, అనిశ్చితిలోనే గడిపింది. జాతీయ స్థాయి అత్యంత కీలకమైన పరీక్ష నిర్వహణలో ఇలాంటి తప్పిదాలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎన్‌టీఏ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.








