---Advertisement---

CJP Delhi Protest: ఢిల్లీలో సీజేపీ నిరసనలు.. కేంద్ర ప్రభుత్వంపై యువత ఆగ్రహం

June 20, 2026

Summarize with AI

---Advertisement---

దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్ (Jantar Mantar) వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో భారీ నిరసనలు (Protests) కొనసాగుతున్నాయి. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగ సమస్యలు, నియామక పరీక్షల్లో అవకతవకలను ప్రధాన అంశాలుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) సీజేపీ నాయకత్వం నిలదీస్తోంది. ముఖ్యంగా నీట్ పరీక్ష (NEET Examination) పేపర్ లీక్ (Paper Leak) ఘటనపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెంటనే రాజీనామా (Resignation) చేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke) నిరసనల్లో పాల్గొంటూ కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్, సీబీఎస్సీ(CBSE) మూల్యాంకన వివాదాలు, వివిధ నియామక పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితులకు పూర్తి బాధ్యత కేంద్ర విద్యాశాఖదేనని, మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

సీజేపీ(CJP) పిలుపుతో జరిగిన ఈ నిరసనలకు భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత(Unemployed Youth), విద్యార్థులు తరలివచ్చారు. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా సిద్ధమవుతున్న యువతకు వరుసగా జరుగుతున్న పరీక్షల అవకతవకలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని వారు ఆరోపించారు.

ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందిన కాక్రోచ్ జనతా పార్టీ, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. జూన్ 6న ఢిల్లీలో (Delhi) నిర్వహించిన తొలి భారీ నిరసనలో వందలాది మంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి దేశంలోని పలు నగరాల్లో సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతుండగా, ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) సీజేపీ నాయకత్వం బహిరంగ లేఖ రాసింది. పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం ప్రకటించాలని కోరింది. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.

దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగాల విషయంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని సీజేపీ చేపడుతున్న ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యల పరిష్కారమే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యంగా మారుతున్నట్లు వారు పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment