ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా కాపు సామాజిక వర్గంలోనూ కొత్త చర్చకు దారితీశాయి. కాపులకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడిగా చంద్రబాబు నిలిచారని, వాటిని రద్దు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచిపోయారని ఆయన చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విమర్శకుల వాదన ప్రకారం, వైఎస్ జగన్ ఎప్పుడూ కాపు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇవ్వలేదని, ఆ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పూర్తిగా సాధ్యమయ్యే విషయం కాదని బహిరంగంగానే చెప్పారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికల్లో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేకపోయిందనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ప్రత్యేకంగా కేటాయిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విభజన రాజ్యాంగబద్ధతపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం ఈ అంశం న్యాయస్థానాల దృష్టికి వెళ్లగా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విభజన నిబంధనలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడటంతో ఆ ఉత్తర్వులు అమలులో నిలిచిపోయాయి.
కాపు వర్గానికి చెందిన కొందరు నాయకులు, మేధావులు మరో వాదనను ముందుకు తెస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో కాపుల జనాభా గణనీయంగా ఉంటుందని, అలాంటి పరిస్థితిలో మొత్తం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అవకాశాన్ని తగ్గించి కేవలం 5 శాతానికి పరిమితం చేయడం వల్ల దీర్ఘకాలంలో కాపులకే నష్టం జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాభా ప్రాతిపదికన చూస్తే పూర్తి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలులో ఉండటం వల్లే ఎక్కువ అవకాశాలు కాపులకి లభించేవని వారు వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అప్పటి జగన్ ప్రభుత్వం ప్రత్యేక 5 శాతం కోటాను కొనసాగించకుండా, సాధారణ ఈడబ్ల్యూఎస్ విధానానికే మద్దతు ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, నిజంగా 5 శాతం రిజర్వేషన్ కాపులకు న్యాయమైనదే అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దానిని తిరిగి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడంతో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలను కాపు సామాజిక వర్గం నిలదీసే పరిస్థితి వస్తే కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో తాను అధికారంలోకి వస్తే కాపులకి రిజర్వేషన్ కల్పిస్తాం అని చేసిన హామీలను ప్రస్తావిస్తూ కాపు రిజర్వేషన్ల అమలుపై డిమాండ్లు పెరిగితే, ఈ అంశం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






