కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు (Families) ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) ఇవ్వాలన్న తమిళనాడు ప్రభుత్వ (Tamil Nadu Government) నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ (High Court Madurai Bench) మధ్యంతర ఊరటనిచ్చింది. ఉద్యోగాల నియామకాలపై స్టే విధించాలన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించినప్పటికీ, ఈ నియామకాలు కేసులో తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వ విధాన నిర్ణయంలో ఈ దశలో జోక్యం చేసుకోవడం సరైంది కాదని ధర్మాసనం పేర్కొంది. నియామకాలు పొందిన వారు తొలి నెల జీతం అందుకునేలోపు కేసు విచారణ పూర్తి చేయాలని నిర్ణయిస్తూ, తదుపరి విచారణను జూలై 21కు వాయిదా వేసింది. అలాగే సుమోటోగా (Suo Motu) విచారణ చేపట్టిన కోర్టు, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను (Tamil Nadu Public Service Commission) ప్రతివాదిగా చేర్చి, సుప్రీంకోర్టు (Supreme Court) పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్న సీబీఐకి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
ఈ నియామకాలను నిలిపివేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో, ప్రభుత్వ ఉద్యోగాలు టీఎన్పీఎస్సీ వంటి చట్టబద్ధ ప్రక్రియ ద్వారానే ఇవ్వాలని పిటిషనర్లు వాదించారు. సీబీఐ(CBI) దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల సాక్షులపై ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అయితే బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పేమిటని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా అవసరమని వ్యాఖ్యానిస్తూ, రాజకీయ వ్యాఖ్యలకు ఇది వేదిక కాదని పిటిషనర్లను హెచ్చరించారు. గతంలో తూత్తుకుడి స్టెర్లైట్ (Thoothukudi Sterlite) ఘటన తర్వాత కూడా ఇలాంటి నియామకాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (C. Joseph Vijay) కరూర్ పర్యటనలో భాగంగా మృతుల కుటుంబాలను పరామర్శించి, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేయనున్నారు.
గత ఏడాది సెప్టెంబరులో తమిళనాడు వెట్రి కజగం(TVK) నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సౌకర్యాల కొరత, జన నియంత్రణలో వైఫల్యమే ప్రమాదానికి కారణమని పోలీసుల నివేదిక పేర్కొనగా, టీవీకే మాత్రం ఇది పోలీసుల వైఫల్యమేనని ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.







