గతంలో తెనాలిలో కొందరు యువకులను నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో విచక్షణారహితంగా కొట్టిన ఘటనలో అప్పటి సీఐ రాములు నాయక్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శారీరక శిక్షలు విధించే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారంటూ ప్రజలు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఆ సమయంలో హోంమంత్రి కూడా సీఐ చర్యలను సమర్థించడం మరింత వివాదాస్పదమై, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో పోలీసు ఉన్నతాధికారులు చివరకు సీఐపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా, అప్పట్లో ప్రభుత్వం వెనుకేసుకొచ్చిన అదే సీఐ రాములు నాయక్‌పై ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తీవ్ర ఆరోపణలు వెలుగులోకి రావడం మరోసారి చర్చనీయాంశమైంది.
ఒంగోలుకు చెందిన అరుణ కుమారి అనే మహిళ, సీఐ రాములు నాయక్ తనను మోసం చేసి వేధింపులకు గురిచేస్తున్నాడంటూ గుంటూరు ఎస్పీని ఆశ్రయించడం కలకలం రేపింది. ఇప్పటికే సస్పెండ్ అయిన రాములు నాయక్‌పై ఆమె పలు ఆరోపణలు చేస్తూ, తనకు మరియు తన పిల్లలకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ రక్షణ కల్పించాలని ఎస్పీని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బాధితురాలి కథనం ప్రకారం, ఆమెకు 2004లో వివాహం కాగా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విభేదాలు రావడంతో ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. ఆ సమయంలో అక్కడ ఎస్‌ఐగా పనిచేస్తున్న రాములు నాయక్ ఆమెకు పరిచయం అయ్యాడు. అనంతరం ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడటం ప్రారంభించాడు. ఒంటరిగా జీవిస్తున్న సమయంలో ఆమెకు దగ్గరైన రాములు నాయక్, తల్లిదండ్రులు మరో వివాహం చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీశైలానికి తీసుకెళ్లి, తాను ఇప్పటికే వివాహితుడైనప్పటికీ రెండో వివాహం చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. అప్పటి నుంచి తన బాధ్యతలను చూసుకున్నాడని తెలిపింది.
అయితే తెనాలి సీఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాములు నాయక్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని అరుణ కుమారి పేర్కొంది. ఆరా తీయగా తెనాలిలో మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిందని తెలిపింది. ఈ విషయంపై ప్రశ్నించగా తన గురించి బయట ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని ఆరోపించింది. రూ.30 లక్షలు ఇస్తానని, వాటితో బంగారం కొనుక్కొని తన జీవితంలో నుంచి వెళ్లిపోవాలని చెప్పాడని, కానీ తాను అందుకు అంగీకరించలేదని పేర్కొంది.
తరువాత తెనాలి డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రాములు నాయక్‌ను వీఆర్‌కు పంపినట్లు తెలిపింది. అప్పటి నుంచి తననే కారణమంటూ వేధింపులు పెంచాడని, తమ వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని, చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించింది.
వేధింపులు అధికమవడంతో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆశ్రయించి తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ, రాములు నాయక్ ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారని పేర్కొంటూ, ఫిర్యాదు మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇక రాష్ట్రంలో ఇటీవల వరుసగా పలువురు పోలీసు అధికారులపై తీవ్ర ఆరోపణలు రావడం, వివాహేతర సంబంధాల ఆరోపణలతో సస్పెన్షన్లు, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, లాకప్ డెత్ కేసులు, అలాగే నేరగాళ్లతో కుమ్మక్కై హనీట్రాప్ వంటి వ్యవహారాల్లో పాల్గొన్నారనే ఆరోపణలు వెలుగులోకి రావడం పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర పోలీసు వ్యవస్థతో పాటు హోం శాఖ పనితీరుపై కూడా తీవ్ర చర్చకు దారితీశాయి.







