తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీ పేరు మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జీఎస్టీ వంటి కీలక విభాగాల్లో పనిచేసిన ఆయనపై గతంలోనే అధికార దుర్వినియోగం, అక్రమాస్తుల సంపాదన, లంచాల వ్యవహారాలు, రాజకీయ ప్రేరేపిత చర్యలు వంటి ఆరోపణలు వెలువడ్డాయి. ఇప్పుడు తాజా క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆయన పాత్రపై మళ్లీ తీవ్ర చర్చ జరుగుతోంది.
1992లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా సేవలు ప్రారంభించిన బొల్లినేని గాంధీ, నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 13 సంవత్సరాల పాటు ఈడీలో కొనసాగడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. సాధారణంగా ఇలాంటి కీలక దర్యాప్తు సంస్థల్లో అధికారులు రెండేళ్లు లేదా అత్యవసర పరిస్థితుల్లో మూడేళ్లకు మించి కొనసాగరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఆయన విషయంలో ప్రత్యేక మినహాయింపులు కల్పించబడ్డాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారిపై నమోదైన ఈడీ కేసుల్లో బొల్లినేని గాంధీ కీలక పాత్ర పోషించారని అప్పట్లో వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తూ, రాజకీయ ప్రేరేపితంగానే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులతో సంబంధం లేని భారతి రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం, ఆస్తుల అటాచ్‌మెంట్ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. మరోవైపు టీడీపీ నేత సుజనా చౌదరికి సంబంధించిన జీఎస్టీ ఎగవేత కేసుల్లో మాత్రం గాంధీ అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి.
బొల్లినేని గాంధీపై నమోదైన అవినీతి ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. పదేళ్ల సేవాకాలంలో ఆయన పొందిన జీతం సుమారు రూ.65 లక్షలు మాత్రమే అయినప్పటికీ, సీబీఐ దర్యాప్తులో రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. హైదరాబాద్, విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయడం, కుమార్తె మెడికల్ సీటు కోసం భారీ మొత్తాలు చెల్లించడం, 2010 నుండి 2019 మధ్య ఆయన ఆస్తులు 288 శాతం పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
అంతేకాకుండా, ఒక వ్యాపారవేత్త నుంచి రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రూ.10 లక్షలు నగదు స్వీకరిస్తున్న సమయంలో సేకరించిన ఫోటోలు, ఆడియో రికార్డులు కూడా దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ, 2020లో ఆయనకు అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి లభించడం కూడా వివాదాస్పదమైంది.
2021లో సీబీఐ అధికారులు అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు నకిలీ కోవిడ్ నివేదికలతో తప్పించుకునేందుకు ప్రయత్నించారని, అనంతరం అవి నకిలీవని నిర్ధారించిన అధికారులు ఆయనను అరెస్టు చేసిన ఘటన కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇటీవల ‘మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా’ పేరుతో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థలో పెట్టుబడిదారుల నిధులను ఇతర సంస్థలకు మళ్లించి మోసం చేశారనే ఆరోపణలతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయనపై నమ్మకద్రోహం కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో బొల్లినేని గాంధీపై ఉన్న పాత ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో, ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని రాజకీయ ప్రత్యర్థులపై చర్యలకు ఉపయోగించారని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారిపై నమోదైన కేసుల వెనుక రాజకీయ కక్ష సాధింపే ప్రధాన ఉద్దేశమని, ఇప్పుడు బొల్లినేని గాంధీపై వరుస కేసులు నమోదవుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఈ వ్యవహారం చంద్రబాబు రాజకీయ శైలిపై కూడా కొత్త చర్చకు దారితీస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.







