భీమవరంలో అక్వా రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ముఖ్యంగా అక్వా రంగం సిండికేట్‌ల చేతుల్లో చిక్కుకుని రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు.
ఫీడ్, సీడ్ ధరలను కొందరు సిండికేట్‌లు ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారని, ప్రభుత్వం మాత్రం “దున్నపోతు మీద వర్షం పడినట్లుగా” స్పందిస్తోందని జగన్ విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కన్నా సిండికేట్‌లకే మేలు జరుగుతోందని ఆరోపించారు.
తమ ప్రభుత్వ హయాంలో అక్వా రైతుల కోసం అప్సడా ద్వారా ఫీడ్, సీడ్ ధరలను పర్యవేక్షించామని, యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్, రూ.3,306 కోట్ల సబ్సిడీ, 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, ఫిషరీస్ అసిస్టెంట్ల నియామకం వంటి చర్యలు చేపట్టామని జగన్ గుర్తు చేశారు. అదే సమయంలో రాష్ట్రం రూ.20 వేల కోట్ల అక్వా ఎగుమతులతో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు కూడా సాధించిందని తెలిపారు.
ప్రస్తుతం కేజీ రొయ్య ధర రూ.230 దాటని పరిస్థితి నెలకొనగా, ఫీడ్ ధరలను నాలుగు నెలల్లో కేజీకి రూ.14–16 వరకు పెంచారని ఆయన ఆరోపించారు. ధరలు పెంచేటప్పుడు వేగంగా పెంచి, తగ్గించాల్సినప్పుడు మాత్రం “ముష్టి వేసినట్లు రూ.2 మాత్రమే తగ్గిస్తున్నారు” అంటూ విమర్శించారు.
అక్వా రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని, నరసాపురం ఫిషరీస్ యూనివర్సిటీ పనులు నిలిపివేయడం, రూ.1.50 విద్యుత్ పథకాన్ని నిలిపివేయడం, వేలాది విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉంచడం వల్ల రైతులు జనరేటర్లతో సాగు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ పేర్కొన్నారు.
చివరగా, అక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని, మళ్లీ రైతు ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్సడాకు పూర్వవైభవం తీసుకొచ్చి రైతులకు అండగా నిలుస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.






