ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు ప్రముఖ నాయకులు తమ చివరి రోజుల్లో కుటుంబ విభేదాల కారణంగా మనోవేదనకు గురయ్యారని, వారి మరణానంతరం అంతిమ యాత్రల సమయంలో కుటుంబ కలహాలు బహిర్గతమయ్యాయని పలువురు ప్రస్తావిస్తున్నారు. నాడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు, నేడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలోనూ దాదాపు అదే తరహాలో కనిపించాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
1996లో ఎన్టీఆర్ మరణించిన సమయంలో ఆయన భౌతిక కాయం వద్ద కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు వెలుగులోకి వచ్చాయి. అంతిమ సంస్కారాల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో కుటుంబ సభ్యులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఘటనలు, అంతిమ సంస్కారాల నిర్వహణ తీరుపై మీడియా, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. అల్లుడిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయ ద్రోహమే ఆయన మరణానికి ప్రధాన కారణమనే విమర్శలతో ఆయన మరణం రాజకీయ రగడకు వేదికగా మారిపోయింది.
ముద్రగడ పద్మనాభం గారి విషయంలోనూ కుటుంబ విభేదాలు ఆయన అంతిమ యాత్ర సమయంలో బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా రాజకీయ అభిప్రాయ భేదాల కారణంగా ఆయన కుమార్తె క్రాంతితో సంబంధాలు దెబ్బతిన్నాయని గతంలోనే ముద్రగడ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్‌కు క్రాంతి మద్దతు ప్రకటించిన తర్వాత తండ్రీ–కూతుళ్ల మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. కనీసం పవన్ కళ్యాణ్ సైతం ముద్రగడ పద్మనాభం గారి మొండితనం, ఆత్మాభిమానం తెలిసి కూడా కుటుంబంలో చీలిక వచ్చేలా ఆమెను చేర్చుకోవడం సరైనది కాదని ముద్రగడ గారి అభిమానులు నేటికీ చెబుతున్న మాట.
గతంలో తన సతీమణి అనారోగ్య సమయంలో జరిగిన సంఘటనల గురించి కూడా ముద్రగడ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె క్రాంతి కారణంగా తన కుటుంబం ఎదుర్కొన్న అవమానాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముద్రగడ మరణానంతరం ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని తల్లి, కుటుంబ సభ్యులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రజల్లో అపారమైన ఆదరణ పొందిన ఈ ఇద్దరు నాయకుల జీవితాల్లో చివరి దశలో కుటుంబ విభేదాలు ప్రధాన చర్చగా మారడం విషాదకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాడు ఎన్టీఆర్ అంతిమ యాత్ర సమయంలో కనిపించిన కుటుంబ కలహాలు, నేడు ముద్రగడ పద్మనాభం గారి అంతిమ యాత్రలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.






