డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) హత్య చేసిన వారికి 10 మిలియన్ డాలర్ల (10 Million US Dollars) బహుమతి (Reward) ప్రకటించినట్లు ఇరాక్‌కు (Iraq) చెందిన “ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్” (Islamic Resistance in Iraq)గా గుర్తించుకునే ఓ సాయుధ సంస్థ (Armed Group) సంచలన ప్రకటన విడుదల చేసింది. ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.85 కోట్లకు పైగా) ఇస్తామని తమ అనుబంధ కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను స్వతంత్రంగా ధృవీకరించలేదు. ఈ వార్త వెలువడే సమయానికి వైట్ హౌస్ (White House) లేదా అమెరికా ప్రభుత్వ (US Government) అధికారిక వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
సంస్థ విడుదల చేసిన ప్రకటన “అల్లాహ్ పేరుతో” (Name of Allah) అనే ప్రార్థనతో ప్రారంభమై ఖురాన్‌లోని (Quran) ఒక వాక్యాన్ని ప్రస్తావించింది. అనంతరం అమెరికా ప్రభుత్వం నైతిక విలువలను కోల్పోయిందని ఆరోపించిన సంస్థ, ట్రంప్ ఇప్పటికీ ఇరాన్ మద్దతు ఉన్న కీలక నాయకులు ఖాసిం సొలేమాని(Qasem Soleimani), అబూ మహ్దీ అల్-ముహందిస్ (Abu Mahdi al-Muhandis) వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించింది.
అదే ప్రకటనలో ట్రంప్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. “ఇరాకీల రక్తాన్ని చిందించిన, ప్రజలను నిరాశ్రయులను చేసిన, మా నాయకులు, పిల్లలు, పండితులను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తికి ప్రశాంత జీవితం ఉండదు” అంటూ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే “ట్రంప్‌కు మా నుంచి అవమానం తప్ప మరేమీ దక్కదు. అమరుల పేరిట ప్రమాణం చేస్తున్నాం. అణచివేత కోటలు కూలిపోయే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని పేర్కొంది.
ఈ వివాదానికి మూలం 2020 జనవరిలో జరిగిన అమెరికా డ్రోన్ దాడి (US Drone Strike). బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Baghdad International Airport) సమీపంలో జరిగిన ఆ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సొలేమాని, ఇరాక్ మిలీషియా నాయకుడు అబూ మహ్దీ అల్-ముహందిస్ మరణించారు. ఈ ఘటన తర్వాత అమెరికా, ఇరాన్, ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ సంస్థల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అప్పటి నుంచి అమెరికా ప్రయోజనాలు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని పలుమార్లు బెదిరింపులు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రకటనపై వైట్ హౌస్, అమెరికా చట్ట అమలు సంస్థలు లేదా ఇతర అధికారిక వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే అధికారంలో ఉన్న లేదా మాజీ దేశాధినేతలపై బహిరంగంగా వెలువడే ఇలాంటి బెదిరింపులను భద్రతా సంస్థలు అత్యంత తీవ్రంగా పరిగణిస్తాయి. ఈ ప్రకటనపై సంబంధిత భద్రతా సంస్థలు నిశితంగా నిఘా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకటనకు ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లభించలేదు.







