---Advertisement---

అభివృద్ధి పేరుతో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్? ప్రైవేటీకరణ నిర్ణయాల వెనుక ఆవిరైపోతున్న ప్రజా సంపద!

July 20, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రస్తుత కూటమి ప్రభుత్వం (Coalition Government) చేపడుతున్న ప్రైవేటీకరణ (Privatization) నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ప్రజల భవిష్యత్తుపైనా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మున్సిపల్ ఆస్తుల నుంచి రహదారులు(Roads), ఆర్టీసీ (APSRTC), ఆరోగ్యశ్రీ(Aarogyasri), ప్రభుత్వ వైద్య కళాశాలలు (Government Medical Colleges), పోర్టులు(Ports), టూరిజం(Tourism), రిజిస్ట్రేషన్ సేవల (Registration) సేవల (Services) వరకు అనేక రంగాలను ప్రైవేట్ సంస్థలకు (Private Companies) అప్పగించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 673 ప్రకారం రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు(Municipalities), 21 పట్టణాభివృద్ధి సంస్థల (Urban Development Authorities) పరిధిలోని 14 రకాల పౌర సేవలు, ఆస్తులను ప్రైవేట్ నిర్వహణకు ఇవ్వాలనే ప్రతిపాదన తీవ్ర వివాదానికి దారి తీసింది. మున్సిపల్ కార్యాలయాలు, బస్టాండ్లు, మార్కెట్లు, పార్కులు, స్టేడియంలు, శ్మశానాలు వరకు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని విమర్శకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను 99 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వడం లేదా విక్రయించే ప్రతిపాదన ప్రజా ఆస్తుల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

సుమారు 10,200 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను(State Highways) పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పీపీపీ(PPP) పద్ధతిలో అభివృద్ధి చేసి టోల్ వసూలు (Toll Collection) చేయాలనే ఆలోచన ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగే అవకాశం ఉంది. విజయవాడ వంటి నగరాల్లో అంతర్గత రోడ్ల నిర్వహణను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల పార్కింగ్ ఫీజులు, వినియోగ చార్జీలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

విద్యుత్ బస్సులను (Electric Buses) ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం, డిపోల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం వంటి చర్యలను ప్రతిపక్షాలు ఆర్టీసీ ప్రైవేటీకరణకు తొలి అడుగులుగా పేర్కొంటున్నాయి. ఆర్టీసీకి చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూములు, బస్ స్టేషన్లు, వాణిజ్య ఆస్తులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగితే సామాన్యుడికి చార్జీల భారం తప్పదనే వాదన వినిపిస్తోంది.

పేదలకు సంజీవినిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని (Aarogyasri Scheme) ప్రైవేట్ బీమా సంస్థల ఆధారిత వ్యవస్థగా మార్చడం, ప్రభుత్వ వైద్య కళాశాలలను (Government Medical Colleges) పీపీపీ మోడల్‌లో నిర్వహించడం వంటి నిర్ణయాలు పేదల వైద్య హక్కులపై ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ వైద్య విద్య ఖరీదైపోతే గ్రామీణ, పేద విద్యార్థులకు మెడిసిన్ వంటి కోర్సులు అందుబాటులో లేకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (Passport Seva Kendras) తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలనే నిర్ణయం, భూమి రికార్డులు, వ్యక్తిగత ఆస్తి సమాచారం వంటి అత్యంత సున్నితమైన డేటా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే విమర్శలకు దారి తీసింది. ఇది భవిష్యత్తులో భూమి వివాదాలు, డేటా దుర్వినియోగం వంటి సమస్యలకు కారణమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల సొంత ఆస్తి హక్కులపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

అలాగే వేల కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టును తక్కువ మొత్తంతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా పెట్టుబడితో నిర్మించిన ఆస్తుల లాభాలు ప్రజలకు చెందకుండా చేసే ప్రయత్నం కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు గత చరిత్ర కూడా ప్రజా ఆస్తుల విషయంలో మళ్లీ చర్చకు వస్తోంది. 1995–2004 మధ్య చంద్రబాబు(Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, రాష్ట్ర ఆర్థిక పునర్వ్యవస్థీకరణ పేరుతో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడటం లేదా ప్రైవేటీకరణకు గురయ్యాయని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. నిజాం షుగర్స్, సహకార చక్కెర కర్మాగారాలు, టెక్స్టైల్ యూనిట్లు, స్పిన్నింగ్ మిల్లుల విక్రయాలపై నాటి అవకతవకలను తిరిగి ప్రస్తావిస్తున్నారు. తక్కువ ధరలకు ఆస్తులు అమ్మబడ్డాయని, రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆర్థిక నష్టం జరిగిందని అప్పట్లో వచ్చిన విమర్శలను ఇప్పుడు ప్రస్తుత నిర్ణయాలతో పోల్చి “మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టేశారనే” ఆరోపణలు చేస్తున్నారు.

ఈ విధానాల వల్ల ప్రజలు దీర్ఘకాలంలో ఎదుర్కొనే ప్రమాదాలు చూస్తే చెత్త సేకరణ యూజర్ చార్జీలు, వీధి లైట్ల నిర్వహణ ఫీజులు, పార్కింగ్ చార్జీలు, టోల్ భారం, ప్రజా సేవల ధరల పెరుగుదల, స్థానిక సంస్థల అధికారాల తగ్గింపు, దీంతో ప్రజలు ప్రాథమిక పౌర సేవలకు కూడా ఆర్థిక భారంతో దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

“ఎవరి ప్రయోజనం కోసం ఈ ప్రైవేటీకరణ?” అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ ఆస్తి అంటూ ఏదీ మిగలకుండా చేస్తాయా? అనే ప్రశ్న ప్రజల్లో, నిపుణుల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర సంపదపై కార్పొరేట్ ఆధిపత్యాన్ని పెంచే ప్రక్రియలో భాగమా? అనే సందేహం రోజురోజుకు మరింత బలపడుతోంది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన చర్చగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment