గుజరాత్‌లోని (Gujarat) అహ్మదాబాద్‌లో (Ahmedabad) శనివారం జరిగిన భారీ బాణసంచా ఫ్యాక్టరీ (Firecracker Factory) పేలుడు (Explosion) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్రమంగా నిర్వహిస్తున్న పటాకుల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. రామోల్-గాత్రాడ్ (Ramol Gatrad) రోడ్డులోని కాలువ సమీపంలో బహిరంగ ప్రదేశంలో ఈ ఫ్యాక్టరీ నడుస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రారంభంలో 2 మంది మాత్రమే మృతి చెందినట్లు సమాచారం వచ్చినప్పటికీ, శిథిలాల తొలగింపు పనులు కొనసాగడంతో మృతుల సంఖ్య 8కు చేరింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వెంటనే ఎల్జీ ఆసుపత్రి(LG Hospital), సివిల్ ఆసుపత్రికి (Civil Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో ఈ ఫ్యాక్టరీని మేహుల్ దొడియా (Mehul Dodiya) నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ యూనిట్‌కు సంబంధించిన లైసెన్స్‌ను అధికారులు ఇప్పటికే రద్దు చేసినప్పటికీ, నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్యంగా పటాకుల తయారీ కొనసాగించినట్లు వెలుగులోకి వచ్చింది. భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు గల అసలు కారణాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (Forensic Science Laboratory) బృందాలతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఘటనాస్థలంలో ఆధారాలను సేకరిస్తున్నాయి. శిథిలాల తొలగింపు పనులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.








