---Advertisement---

David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన డేవిడ్ వార్నర్.. కోర్టులో నేరం అంగీకారం..శిక్షపై ఉత్కంఠ..!

July 22, 2026

Summarize with AI

---Advertisement---

డేవిడ్ వార్నర్ (David Warner) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (Drink and Drive) కేసులో కోర్టు ముందు తన తప్పును అంగీకరించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా (Australia) మాజీ స్టార్ ఓపెనర్‌పై నమోదైన ఈ కేసులో శిక్షను ఖరారు చేసేందుకు కోర్టు ఆగస్టు 18 తేదీని నిర్ణయించింది. ఈ వ్యవహారం ఆయన వ్యక్తిగత జీవితానికే కాదు.. సిడ్నీ థండర్ కెప్టెన్‌గా (Sydney Thunder Captain) కొనసాగుతారా లేదా అనే అంశంపైనా పెద్ద చర్చకు దారితీసింది.

ఈ కేసుపై బుధవారం వేవర్లీ లోకల్ కోర్టులో (Waverley Local Court) విచారణ జరిగింది. అయితే వార్నర్ స్వయంగా కోర్టుకు హాజరుకాలేదు. ఆయన తరఫున హాజరైన న్యాయవాది బాబీ హిల్.. మధ్యస్థాయి మద్యం (Alcohol) సేవించి వాహనం నడిపిన ఆరోపణను వార్నర్ అంగీకరించినట్లు కోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలపై ఇరు పక్షాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు.

ఈ ఘటన ఏప్రిల్ 5న జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League – PSL) నుంచి విరామం తీసుకుని ఆస్ట్రేలియాకు వచ్చిన వార్నర్‌ను సిడ్నీ తూర్పు ప్రాంతంలో పోలీసులు తనిఖీ కోసం ఆపారు. మొదట రోడ్డుపై ప్రాథమిక పరీక్ష నిర్వహించిన పోలీసులు.. అనంతరం మారుబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి బ్రీత్‌లైజర్ పరీక్ష చేశారు. అందులో ఆయన రక్తంలోని ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో అనుమతించిన చట్టబద్ధ పరిమితి కంటే 2 రెట్లు ఎక్కువగా ఉండటంతో కేసు నమోదు చేశారు.

వార్నర్ తరఫు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు ముందు ఆయన ఓ స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లో 3 గ్లాసుల వైన్ తాగారు. చివరిసారిగా మద్యం సేవించిన కేవలం 11 నిమిషాల తర్వాతే పోలీసులు తనిఖీ కోసం ఆపినట్లు చెప్పారు. టాక్సీ (Taxi) లేదా ఉబెర్(Uber) ఉపయోగించాల్సిందని తెలిసినా.. తానే కారు నడపడం పెద్ద తప్పని వార్నర్ పూర్తిగా అంగీకరించారని తెలిపారు. తన చర్యపై తీవ్ర పశ్చాత్తాపంతో ఉన్న ఆయన.. కోర్టు విధించే శిక్షను సాధారణ పౌరుడిలాగే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు న్యాయవాది వెల్లడించారు.

ఈ ఘటనతో సిడ్నీ థండర్ కెప్టెన్సీపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు జట్టు యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు క్రికెట్ ఎన్ఎస్‌డబ్ల్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జర్మన్ మాత్రం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడాన్ని తమ సంస్థ ఎప్పటికీ సమర్థించదని.. రోడ్డు భద్రతపై రాజీ ఉండదని తెలిపారు.

ఈ వివాదానికి మరో ప్రత్యేక కారణం కూడా ఉంది. సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్స్, ఎన్ఎస్‌డబ్ల్యూ బ్లూస్ జట్లు రాష్ట్ర ప్రభుత్వ “డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్” అవగాహన కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాయి. అలాంటి ప్రచారంలో పాల్గొనే జట్టు కెప్టెన్‌పైనే డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరోపణలు రావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

ఇదిలా ఉంటే.. 2018లో జరిగిన సాండ్‌పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్ జీవితకాల నాయకత్వ నిషేధాన్ని ఎదుర్కొన్నారు. ఆ నిషేధాన్ని 2024లో ఎత్తివేయడంతో సిడ్నీ థండర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు తాజా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నేపథ్యంలో ఆయన కెప్టెన్సీ కొనసాగుతుందా.. లేక మరోసారి పెద్ద దెబ్బ తగులుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 18న కోర్టు తీర్పుతో పాటు క్రికెట్ వర్గాల నిర్ణయంపైనా అందరి దృష్టి నిలిచింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment