కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) సంచలన పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) సిద్ధరామయ్య (Siddaramaiah) వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పోటీ చేయబోనని అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేసిన ఆయన.. ప్రజాసేవ (Public Service) మాత్రం ఆపనని వెల్లడించారు. ఎక్స్ వేదికగా చేసిన సుదీర్ఘ పోస్టులో ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయని, అయినప్పటికీ ప్రజల సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
వరుణ నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుతం తన వయసు 79 సంవత్సరాలని, ప్రభుత్వం పదవీకాలం పూర్తయ్యే సమయానికి 81 నుంచి 82 సంవత్సరాల మధ్య ఉంటానని చెప్పారు. ఆరోగ్యం (Health) కూడా గతంలా సహకరించడం లేదని, అదే ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయడం కష్టమవుతోందని పేర్కొన్నారు. 2028 నాటికి తన రాజకీయ ప్రయాణానికి 50 సంవత్సరాలు పూర్తవుతాయని గుర్తుచేశారు.
1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన తాను గెలుపోటములను సమానంగా స్వీకరించానని సిద్ధరామయ్య అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను నమ్మిన సిద్ధాంతాలను వదల్లేదని, తన అంతరాత్మకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని తెలిపారు. అదే తన రాజకీయ జీవితంలో అతిపెద్ద సంతృప్తి అని పేర్కొన్నారు.
గతంలో ప్రజలే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్థికంగా సహాయం చేసేవారని, కానీ ఇప్పుడు ప్రజలకు డబ్బులు పంచితేనే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని, నిజాయితీ రాజకీయాలకు అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు. అందుకే ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.
గత 50 సంవత్సరాలుగా కర్ణాటక ప్రజలు (Karnataka People) తనను కుటుంబ సభ్యుడిలా ఆదరించారని సిద్ధరామయ్య భావోద్వేగంగా చెప్పారు. ప్రజలు చూపిన ప్రేమను జీవితాంతం మరచిపోలేనని, మిగిలిన జీవితాన్ని కూడా ప్రజాసేవకే అంకితం చేస్తానని స్పష్టం చేశారు.
1948 ఆగస్టు 12న మైసూరు సమీపంలోని సిద్ధరామనహుండిలో రైతు కుటుంబంలో (Farmer Family) జన్మించిన సిద్ధరామయ్య న్యాయవాదిగా(Lawyer), న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా (Law Lecturer) తన కెరీర్ ప్రారంభించారు. రైతు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన 1978లో రాజకీయాల్లో ప్రవేశించారు. అనంతరం పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎదిగారు. 2013 నుంచి 2018 వరకు, అనంతరం 2023 నుంచి 2026 మే వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2026 మేలో అధిష్టానం నిర్ణయంతో సీఎం పదవికి రాజీనామా చేయగా ప్రస్తుతం డీకే శివకుమా (D.K. Shivakumar)ర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సిద్ధరామయ్య తాజా నిర్ణయం కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.







