పంజాబ్‌లో (Punjab) భారీ ఉగ్ర కుట్రను (Major Terror Conspiracy) పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ (Pakistan Intelligence Agency) ఐఎస్ఐ (ISI) ఆదేశాలతో దేశంలో విధ్వంసానికి ప్లాన్ చేస్తున్న రెండు వేర్వేరు ముఠాలను అమృత్సర్ పోలీసులు (Amritsar Police) ఛేదించారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 4 మంది మైనర్లు ఉండటం సంచలనంగా మారింది. నిందితుల వద్ద నుంచి 4 పెట్రోల్ బాంబులు, 2 పిస్టళ్లు, 9 కార్ట్రిడ్జ్లు, లైటర్లు, ఇతర అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో మరింత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ నెట్వర్క్ ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్ (Jantar Mantar) వరకు విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టైన వారిలో ఒకరు తన సహచరులతో కలిసి జంతర్ మంతర్‌లో జరిగిన నిరసనలకు వెళ్లినట్లు, అక్కడే ఉగ్రదాడికి (Terror Attack) కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన వ్యక్తి ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందించే ప్రయత్నం జరిగినప్పటికీ, భద్రతా సంస్థల అప్రమత్తతతో ఆ ప్లాన్ పూర్తిగా విఫలమైంది.
మొదటి ముఠాకు చెందిన రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన సుఖ్మన్ సింగ్‌తో (Sukhman Singh) పాటు 3 మంది మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 బాటిల్ బాంబులు, 2 పిస్టళ్లు, 9 కార్ట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. సుఖ్మన్ సింగ్ ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నేరుగా సంప్రదింపులు కొనసాగిస్తూ, పంజాబ్‌లోని పోలీస్ భవనాలు, పోలీసుల కదలికలపై రెక్కీ నిర్వహించినట్లు విచారణలో అంగీకరించాడు.
ఇక రెండో ముఠా రైల్వే ట్రాక్‌ల వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చి, ఆ దృశ్యాలను పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు (Pakistan Handlers) పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జోడా ఫాటక్ సమీపంలో కెమెరా ఏర్పాటు చేసిన కేసులో వంశీ కుమార్‌తో (Vamsi Kumar) పాటు మరో మైనర్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పిస్టల్, కెమెరాలు, దొంగిలించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ ప్రాంతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అన్మోల్ సింగ్‌తో (Harman Singh) పాటు ఇప్పటికే ఆయుధాల చట్టం కింద జైలులో ఉన్న సుఖ్‌దేవ్ సింగ్ (Sukhdev Singh), హర్మాన్ సింగ్‌లను ప్రొడక్షన్ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో 19 ఏళ్ల వంశీ కుమార్, 24 ఏళ్ల హర్మాన్ సింగ్, 30 ఏళ్ల సుఖ్‌దేవ్ సింగ్, 20 ఏళ్ల అన్మోల్ సింగ్, 19 ఏళ్ల సుఖ్మన్ సింగ్‌తో పాటు 4 మంది మైనర్లు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన, చదువు మధ్యలోనే ఆపేసిన మైనర్లను డబ్బు ఆశ చూపించి, పెట్రోల్ బాంబులు తయారు చేయడం నేర్పించి దేశవ్యతిరేక కార్యకలాపాల్లోకి దింపినట్లు పోలీసులు వెల్లడించారు. విదేశీ ఫండింగ్, స్థానిక సహకారం, ఆయుధాల సరఫరా వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోంది.







