యునైటెడ్ కింగ్‌డమ్‌లోని(United Kingdom) నార్త్ యార్క్‌షైర్(North Yorkshire) హారోగేట్‌లో(Harrogate) ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజీ (AFC)లో మహిళా జూనియర్ సైనికులపై(Female Junior Soldiers) జరిగిన అత్యాచారాలు, లైంగిక వేధింపుల(Sexual Harassment) ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కాలేజీలో శిక్షణ పొందిన కనీసం 4 మంది మహిళలు తమకు 17 ఏళ్ల వయసులోనే సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపులు(Sexual Harassment), రహస్యంగా గమనించడం వంటి దారుణ ఘటనలకు గురయ్యామని బీబీసీకి(BBC) వెల్లడించారు. అంతేకాదు, కొందరు సిబ్బంది ప్రోత్సాహంతోనే మహిళలపై ద్వేషపూరిత వైఖరి, లైంగిక హింస కొనసాగిందని ఆరోపించారు.
AFC అనేది 19 ఏళ్లలోపు యువత కోసం యూకేలో(UK) ఉన్న అతిపెద్ద సైనిక శిక్షణా కేంద్రం. 16 ఏళ్ల వయసు నుంచే సైన్యంలో చేరే రిక్రూట్లకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఈ కాలేజీలో మొత్తం 889 మంది రిక్రూట్లు ఉండగా, వారిలో కనీసం 70 మంది మహిళా జూనియర్ సైనికులు ఉన్నారు. ఈ ఆరోపణలతో బ్రిటిష్ సైన్యంలో(British Army) మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
గత ఏడాదిలో మాత్రమే AFCకు సంబంధించిన 16 లైంగిక నేరాల ఫిర్యాదులు నార్త్ యార్క్‌షైర్ పోలీసులకు చేరాయి. వీటిలో లైంగిక వేధింపులు, లైంగిక దాడి కేసులు ఉన్నాయి. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2018 జనవరి నుంచి 2025 జూన్ వరకు మొత్తం 176 లైంగిక దుర్వ్యవహార ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో 32 కేసులు శాశ్వత సిబ్బందిపై, 144 కేసులు జూనియర్ సైనికులపై నమోదైనట్లు వెల్లడైంది.
బాధితుల్లో ఒక మహిళ తన అనుభవాన్ని వెల్లడిస్తూ చిన్నప్పటి నుంచే సైనికురాలు కావాలని కలలు కనేదాన్నని, కానీ అకాడమీలో తోటి జూనియర్ సైనికులు గంటల పాటు తనపై అత్యాచారం చేయడంతో తన జీవితమే మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటన జరిగిన సమయంలో తన వయసు 17 సంవత్సరాలని, తన బట్టలు విప్పి శారీరకంగా వేధించి, గంటల పాటు అమానుషంగా హింసించారని తెలిపింది. తనను మనిషిలా కాకుండా ఒక వస్తువులా చూశారని చెప్పిన ఆమె, ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే సైన్యాన్ని విడిచిపెట్టినట్లు వెల్లడించింది.
మరోవైపు బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం కొందరు శిక్షకులే మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ వేధింపులను ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ ఘటనలను బ్రిటిష్ ఆర్మీ తీవ్రంగా పరిగణిస్తూ సాయుధ దళాల్లో లైంగిక హింసకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేసింది. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పిలుపునిస్తూ, వారికి న్యాయపరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.








