యూపీఐతో(UPI) పాటు ఇతర డిజిటల్ చెల్లింపులపై(Digital Payments) బ్యాంకులు(Banks), చెల్లింపు సేవల సంస్థలు ఛార్జీలు (Payment Service Providers Charges) విధించే అవకాశానికి మార్గం సుగమమైంది. ఈ దిశగా పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో(Payment and Settlement Systems Act, 2007) సవరణలు చేస్తూ తీసుకొచ్చిన కీలక బిల్లును లోక్‌సభ (Lok Sabha) గురువారం ఆమోదించింది. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో కొన్ని డిజిటల్ చెల్లింపులపై సేవా రుసుములు అమలు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం పొందనుంది.
ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం యూపీఐతో సహా కొన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపులపై (Electronic Payments) బ్యాంకులు లేదా చెల్లింపు సేవల సంస్థలు మర్చంట్ డిస్కౌంట్ రేట్ లేదా ఇతర రుసుములు వసూలు చేయడానికి అనుమతి లేదు. కొత్త సవరణ అమల్లోకి వస్తే, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏ డిజిటల్ చెల్లింపు విధానంపై ఎంత మేర ఛార్జీలు విధించాలో నిర్ణయించవచ్చు.
ఇప్పటికే ఆర్‌టీజీఎస్(RTGS), ఎన్‌ఈఎఫ్‌టీ(NEFT) వంటి బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీలు అమలులో ఉన్నాయి. అయితే యూపీఐ లావాదేవీలు ఇప్పటి వరకు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే యూపీఐపై ఛార్జీలు అమల్లోకి రావని స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మాత్రమే ఏ లావాదేవీపై ఎంత రుసుము ఉంటుందో అధికారికంగా వెల్లడించనుంది.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్వహిస్తున్న బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, చెల్లింపు మౌలిక సదుపాయాల సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అధిక విలువ గల వ్యాపార లావాదేవీలపైనే మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలు చేసే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు మినహాయింపు ఉండే అవకాశమున్నప్పటికీ దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.







