ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో(Srisailam) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు(Suicide) పాల్పడిన ఘటన కలకలం రేపింది. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలోని(Annadanam Choultry) 11వ నంబర్ గదిలో(Room) ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సుధాకర్ కుటుంబం గత నెల 28న శ్రీశైలానికి వచ్చి వడ్డెర సత్రంలో గది తీసుకుంది. మూడు రోజులుగా వారు బయటకు రాకపోవడంతో పాటు గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా ముగ్గురు మహిళలు బాత్రూమ్‌లో, ఇద్దరు పురుషులు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు.
మృతులను పల్లపు సుధాకర్(Pallapu Sudhakar), పల్లపు ఆదిలక్ష్మి(Pallapu Adilakshmi), పల్లపు మల్లేశ్వరి(Pallapu Malleswari), పల్లపు శ్రీదేవి(Pallapu Sridevi), గోగుల మణికంఠగా (Gogula Manikantha) గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. సుధాకర్ తన ముగ్గురు అక్కలు, అల్లుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
సుధాకర్ గతంలో పలువురి వద్ద సుమారు రూ.1 కోటి వరకు అప్పులు(Debts) తీసుకున్నట్లు సమాచారం. అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులు (Financial Problems) ఎదుర్కొన్న ఆయన అనంతరం ఆటో నడుపుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఇద్దరు అక్కలను వారి భర్తలు వదిలేయడం, మరో అక్కకు వివాహం కాకపోవడం, ఆర్థిక సమస్యలు వంటి కారణాలు ఘటనకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని తెలిపారు.
మృతుల్లో శ్రీదేవికి పక్షవాతం రావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు నెల రోజుల క్రితం విరూపాక్షపురానికి వెళ్లినట్లు బంధువులు తెలిపారు. అక్కడి నుంచి ఐదుగురూ కలిసి శ్రీశైలానికి వచ్చినట్లు సమాచారం.
మరోవైపు ఘటన జరిగిన ప్రాంతాన్ని శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు. ఆర్థిక సమస్యలకు ప్రభుత్వ సహాయం (Government Help) తీసుకోవాలని, ఆత్మహత్య పరిష్కారం కాదని వారు అన్నారు. సత్రాల్లో 48 గంటలకు మించి గదులు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఇంతకాలం గది ఎలా కేటాయించారనే దానిపై నిర్వాహకులను ప్రశ్నించారు.
సత్రం నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. క్షేత్రంలోని అన్ని సత్రాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని దేవస్థానం అధికారులు కోరారు.





