---Advertisement---

కాళేశ్వరంపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం బట్టబయలు.. NDSA, CWPRS నివేదికలే సాక్ష్యం:హరీశ్ రావు

August 25, 2026

Summarize with AI

---Advertisement---

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం ఒక్కొక్కటిగా బయటపడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్‌డీఎస్‌ఏ అఫిడవిట్‌, సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నివేదికలు కాంగ్రెస్‌ ఆరోపణలకు చెంపపెట్టులా నిలిచాయని పేర్కొన్నారు. కాళేశ్వరం పూర్తిగా కుప్పకూలిందని, ప్రాజెక్టు పనికిరాదని, నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదని చేసిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చని ఎన్‌డీఎస్‌ఏ అఫిడవిట్‌లో స్పష్టంగా ఉందని హరీశ్ రావు తెలిపారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ పరిశీలనలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణపరమైన సమస్యలు గుర్తించలేదని, కాంక్రీట్‌ నాణ్యత కూడా సంతృప్తికరంగా ఉందని వెల్లడైందన్నారు. అయినా రాజకీయ కక్షతో ప్రాజెక్టును పక్కన పెట్టి, గోదావరి నీటిని వినియోగించుకోకుండా దిగువకు వదిలేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం

కాళేశ్వరంపై ఆరోపణలు చేస్తూ నీటిని ఎత్తిపోకుండా ఏపీ వైపు నీటిని వదిలేయడం వల్ల తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. విపక్షాలు ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం దేవాదుల, నంది పంపులను ఆలస్యంగా ప్రారంభించిందన్నారు. అప్పటికే వరద నీరంతా దిగువకు వెళ్లిపోయిందని, ఆలస్యంగా పంపులు ఆన్‌ చేసి కొద్దిసేపటికే నిలిపివేశారని విమర్శించారు.

దేశవ్యాప్తంగా జలాశయాల్లో సగటు నీటి నిల్వలు 64.16 శాతం ఉండగా, తెలంగాణలో కేవలం 35.6 శాతం మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, నీటి నిర్వహణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైనందుకు నిదర్శనమని విమర్శించారు.

నీటి ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి

బీఆర్‌ఎస్‌ పాలనలో నీటి నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, ఇప్పుడు జలాశయాల్లో నీటి నిల్వల విషయంలో బీహార్‌తో పోటీ పడే పరిస్థితికి చేరిందని హరీశ్ రావు అన్నారు. గోదావరి, కృష్ణా జలాలను వినియోగించుకోకుండా దిగువకు వదిలేయడం తెలంగాణకు జరిగిన అన్యాయమని ఆరోపించారు.

కమిషన్లు, విచారణలపై చూపుతున్న శ్రద్ధను గోదావరి, కృష్ణా జలాలను రైతులకు అందించడంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్‌ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ప్రాజెక్టుల నిర్వహణ, రాష్ట్ర నీటి హక్కులు, రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం ఆపి, అన్నారం, సుందిళ్ల మోటార్లను ప్రారంభించి గోదావరి నీటిని ఎత్తిపోసుకోవాలని, రిజర్వాయర్లను నింపి రైతుల పొలాలకు సాగునీరు అందించాలని కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment