యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాల ఎంపికలో కొత్త పంథాను ఫాలో అవుతున్నారు. కమర్షియల్ కథలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌లు, విభిన్న జానర్లతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘చెన్నై లవ్ స్టోరీ’ విజయంతో జోష్‌లో ఉన్న ఆయన.. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా జీ స్టూడియోస్ (Zee Studios) నిర్మిస్తున్న పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్-ఫాంటసీ మూవీ (Mythological Action-Fantasy) ‘ఇంద్రపుత్ర’(Indraputra) టైటిల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. కేఏ ప్రొడక్షన్స్ (KA Productions) బ్యానర్‌పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ, టైటిల్, జానర్ వివరాలను మాత్రం మేకర్స్ రహస్యంగా ఉంచారు.
కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుష్ గోరక్ (Anush Gorak) దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), వై. శివశంకర్ నాయుడు (Y. Shivashankar Naidu) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో కుష్లు మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవి, తనుజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటించనున్నారు.
అయితే సినిమా ప్రకటనలోనే మేకర్స్ ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా సినిమా ప్రకటించినప్పుడు టైటిల్ లేదా కథకు సంబంధించిన క్లూను విడుదల చేస్తారు. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం పక్షి కాళ్లను పోలిన ఓ భయానక ఆకారంతో కూడిన మిస్టరీ పోస్టర్‌ను (Mystery Poster) మాత్రమే విడుదల చేశారు. దీంతో అసలు ఈ పోస్టర్ వెనుక ఉన్న అర్థం ఏమిటనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.
ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కథ, జానర్‌ను పరిచయం చేయబోతున్నామని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ సినిమా హారర్, మిస్టరీ థ్రిల్లర్, ఫాంటసీ లేదా పూర్తిగా కొత్త జానర్లో తెరకెక్కుతుందా అనే చర్చ మొదలైంది.
యువ దర్శకులు, కొత్త టాలెంట్‌తో ప్రయోగాత్మక కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై కిరణ్ అబ్బవరం దృష్టి పెడుతున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగా కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఇతర వివరాలను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది. తొలి పోస్టర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం నిజంగానే సరికొత్త కథను అందిస్తుందా? లేక ఇది ప్రమోషనల్ హైప్లో భాగమేనా? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.







