మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. వీకెండ్‌లో భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ సినిమా సోమవారం కూడా అదే జోరును కొనసాగించింది. దీంతో విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విజయంతో రవితేజ అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. రవితేజ కెరీర్‌లోనే కాకుండా ప్రాంతీయ సినిమాల పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైన పరుగును కొనసాగిస్తోంది. ముఖ్యంగా 4వ రోజు వసూళ్ల విషయంలో ‘ఇరుముడి’ భారీ రికార్డును నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ‘బాహుబలి 2’ మాత్రమే ‘ఇరుముడి’ కంటే ముందుండటం ఆసక్తికరంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను అందుకోవడం సినిమాకు కీలక మైలురాయిగా నిలిచింది. సాధారణంగా వీకెండ్ తర్వాత వసూళ్లు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ ‘ఇరుముడి’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సోమవారం కూడా కలెక్షన్లు బలంగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ రన్‌పై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందన కారణంగా వారాంతపు రోజుల్లోనూ థియేటర్లలో ఆక్యుపెన్సీ ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టికెట్ బుకింగ్స్‌లోనూ ‘ఇరుముడి’ హవా కొనసాగుతోంది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి ఇప్పటికే 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. విడుదలైన తొలి 2, 3 రోజుల్లో మాత్రమే క్రేజ్ కనిపించడం కాకుండా సినిమా రన్ కొనసాగుతున్న కొద్దీ టికెట్ డిమాండ్ కూడా స్థిరంగా ఉండటం చిత్ర బృందానికి కలిసొస్తోంది. ప్రేక్షకుల డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు కూడా సమాచారం.
ఇక 5వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా ఉండటం ‘ఇరుముడి’కు మరో ప్లస్‌గా మారింది. సాధారణంగా సోమవారం తర్వాత సినిమాల వసూళ్లలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తుంది. అయితే ఈ సినిమా మాత్రం 4వ రోజు కూడా మంచి కలెక్షన్లు రాబట్టడంతో పాటు 5వ రోజుకు ముందస్తు బుకింగ్స్‌లోనూ సత్తా చూపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో సినిమా మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే 4 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుత జోరు ఇలాగే కొనసాగితే సినిమా పూర్తి రన్‌లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ కెరీర్‌లో ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులను నమోదు చేస్తుందనే ఆసక్తి నెలకొంది.
మరోవైపు ‘టాక్సిక్’ విడుదల ప్రభావం ‘ఇరుముడి’ వసూళ్లపై ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. రేపు విడుదల కానున్న ‘టాక్సిక్’ను తట్టుకుని కూడా ‘ఇరుముడి’ ఇదే స్థాయిలో వసూళ్లను కొనసాగిస్తే రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోవడం కూడా సాధ్యమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో రవితేజ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.







