కాంగ్రెస్ ప్రభుత్వం భూముల విక్రయాలపై మాజీ ఎంపీ హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కడ భూములు కనిపించినా ప్రభుత్వం వెంటనే విక్రయిస్తోందని ఆరోపించారు. గత 2.5 ఏళ్లలో రూ.30 వేల కోట్ల విలువైన భూములను విక్రయించిందని విమర్శించారు. ప్రజల నుంచి భూములు సేకరించి అనుచరులకు కట్టబెడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు సామాన్యుల భూములను సైతం 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో 22-ఏ నిషేధిత భూముల బాధితులతో నిర్వహించిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. పట్టణ భూ పరిమితి చట్టం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పట్టణ భూ పరిమితి చట్టాన్ని రద్దు చేశారని హరీశ్ రావు తెలిపారు. అనంతరం ప్రభుత్వాలు అవసరమైన అనుమతులు ఇవ్వడంతో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం 2008కు ముందే తమ భూములు పట్టణ భూ పరిమితి చట్టం పరిధిలో ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చుతోందని ఆరోపించారు.
ఇదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై హరీశ్ రావు సెటైర్లు వేశారు. గతంలో దీపావళి సందర్భంగా ప్రతిపక్షాలపై బాంబులు వేస్తానని పొంగులేటి చెప్పారని గుర్తుచేశారు. అయితే ప్రతిపక్షాలపై కాకుండా ప్రజలపై 22-ఏ బాంబు వేశారని ఎద్దేవా చేశారు. ‘‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. నీ బాంబులు ఇవేనా?’’ అంటూ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు తెలిసి ఉండొచ్చని.. కానీ బీఆర్‌ఎస్ నాయకులకు ఉద్యమాలు, పోరాటాలు తెలుసని హరీశ్ రావు అన్నారు. ప్రజల కోసం అవసరమైతే ప్రభుత్వంపై పోరాడి, ప్రభుత్వ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడటం కూడా తమకు తెలుసని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి తొలుత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూములను విక్రయించేందుకు ప్రయత్నించారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వాటిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం తీసుకున్నారని అన్నారు.
అదేవిధంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని 9 వేల ఎకరాల భూములను కూడా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం తీసుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజల భూములతో పాటు ప్రభుత్వ భూములు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన భూములను కూడా ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని విమర్శించారు.
సామాన్యుల భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం.. ముఖ్యమంత్రి బంధువులకు మాత్రం విలువైన ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.








