చిలకలూరిపేటలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 4 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.
మృతులంతా పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నారు. వీరిలో 4 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ బాబుతో పాటు మరో 6 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలంలోనే 4 మంది మృతి చెందగా.. గుంటూరు జీజీహెచ్‌లో 2 మంది, చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మరో వ్యక్తి మృతి చెందారు.
మృతులను మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మ, మరియమ్మ, సువార్తతో పాటు ఆటో డ్రైవర్ బాబుగా గుర్తించారు. ఆటో డ్రైవర్ అకస్మాత్తుగా మలుపు తిప్పడంతో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన 7 మంది మృతి చెందడంతో వేలూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద వాతావరణం అలుముకుంది.







