తిరుపతి విమానాశ్రయాన్ని పిపిపి విధానంలో ప్రైవేటు కంపెనీకి అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యూహాత్మకంగా కీలకమైన జాతీయ సంపదలో విమానాశ్రయాలు ముఖ్యమైనవని, అవి ప్రభుత్వ రంగంలోనే కొనసాగితే దేశ ప్రయోజనాలకు అనుకూలమని ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ కమిటీ 11 విమానాశ్రయాలను పిపిపి విధానంలో ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించినట్లు వార్తలు రావడంతో, ఆ జాబితాలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతి విమానాశ్రయం ఉండడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఏటా 10 లక్షలకు పైగా ప్రయాణికులు తిరుపతి విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధాన నగరాలతో మెరుగైన కనెక్టివిటీ కలిగిన ఈ విమానాశ్రయానికి మరిన్ని విమానయాన సంస్థలు కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో, అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాన్ని మరింత ఆధునీకరించాల్సింది పోయి ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం సమంజసం కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతికి వచ్చే లక్షలాది మంది యాత్రికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలోనే కొనసాగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విమానాశ్రయం ప్రభుత్వ అజమాయిషిలో ఉంటే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు అదనపు ఆర్థిక భారాలు పడకుండా ఉంటాయని పేర్కోంటున్నారు.
తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, దాన్ని ఏఏఐ పరిధిలోనే కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్ మోహన్ నాయుడు ఉండి కూడా తిరుపతి విమానాశ్రయం ప్రవేట్ పరం చేయడం దారుణమైన చర్య అని, ఈ అంశంపై రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తిరుపతి జిల్లా ప్రజానీకం గళం విప్పి విమానాశ్రయాన్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.





