---Advertisement---

ప్రధాని రేసులో విజయ్‌.. మోదీ, రాహుల్‌ తర్వాత మూడో స్థానం!

August 28, 2026

Summarize with AI

---Advertisement---

దేశ తదుపరి ప్రధానమంత్రిగా (Prime Minister) ఎవరిని చూడాలనుకుంటున్నారనే ప్రశ్నకు నిర్వహించిన సర్వేలో తమిళ నటుడు, టీవీకే(TVK) అధినేత విజయ్‌ (Vijay) అనూహ్యంగా మూడో స్థానంలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీకి (Prime Minister Narendra Modi) 48.7 శాతం, కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) 27.1 శాతం మద్దతు లభించగా.. విజయ్‌కు 9.2 శాతం మంది మద్దతు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థిగా విజయ్‌ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.

విజయ్‌ తర్వాత మమతా బెనర్జీ (Mamata Banerjee) 2 శాతం, అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh Yadav) 1.7 శాతం, అభిజిత్‌ దీప్కే(Abhijit Dipke) 1.3 శాతం, అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) 1.2 శాతం మద్దతుతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ప్రతిపక్ష కూటమి నాయకత్వంలోనూ విజయ్‌ సత్తా చాటారు. కూటమికి నాయకత్వం వహించే సామర్థ్యం ఎవరికి ఉందనే ప్రశ్నలో రాహుల్‌ గాంధీ 29 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. విజయ్‌ 12.2 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ 8.5 శాతం, కేజ్రీవాల్‌ 7.5 శాతం, అఖిలేశ్‌ యాదవ్‌ 6.9 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

విజయ్‌ 2024లో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు టీవీకే వర్గాల్లో ప్రారంభమయ్యాయి.

ఇటీవల టీవీకే నేతలు విజయ్‌ను భవిష్యత్‌ ప్రధానిగా(PM) ప్రస్తావిస్తున్నారు. ఆగస్టు 18న టీవీకే మంత్రి శరత్‌కుమార్‌ (Sarathkumar) విజయ్‌ భవిష్యత్‌ ప్రధాని అంటూ వ్యాఖ్యానించారు. మరో నేత ఆధవ్‌ అర్జున కూడా దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే సర్వే ఫలితాలు టీవీకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.

ఇండియా టుడే గ్రూప్‌ (India Today Group) నిర్వహిస్తున్న మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (Mood of the Nation) సర్వేలో భాగంగా సీ ఓటర్‌ (C-Voter) ఈ సర్వేను నిర్వహించింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించగా.. గత 6 నెలల్లో నిర్వహించిన ట్రాకింగ్‌ సర్వేలలోని 91,795 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. సర్వేలో లభించిన ప్రజాదరణను దేశవ్యాప్తంగా ఓట్లుగా మార్చుకోవడం విజయ్‌కు సవాలే. తమిళనాడు వెలుపల పార్టీని విస్తరించడం, కూటములు ఏర్పాటు చేయడం, జాతీయ స్థాయిలో తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవడం ఆయన ముందున్న కీలక సవాళ్లు. అయినప్పటికీ తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో విజయ్‌ పేరు వినిపించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment