న్యాచురల్ స్టార్ నాని(Nani) కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్(The Paradise) సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) టికెట్ ధరల పెంపుతో(Ticket Price Hike) పాటు ప్రత్యేక ప్రదర్శనలకు (Special Shows) అనుమతి ఇచ్చింది.
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (Sri Lakshmi Venkateswara Cinemas LLP) విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతించింది. జీఎస్టీతో కలిపి ఒక్కో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. సెప్టెంబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 5 ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో టికెట్‌పై రూ.95, సింగిల్ స్క్రీన్లలో రూ.48 అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో రూ.45, సింగిల్ స్క్రీన్లలో రూ.23 అదనపు చార్జీ వర్తించనుంది. ఈ మొత్తాల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది.
టికెట్ ధరల పెంపునకు అనుమతితో పాటు నిర్మాతలు తెలుగు చిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ కమిటీకి (Telugu Film Industry Employees Welfare Committee) రూ.1 కోటి విరాళం అందించాలని ప్రభుత్వం షరతు విధించింది. ఈ నిధులను సినీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు.
అలాగే థియేటర్లలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న ది ప్యారడైజ్‌కు ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ప్రత్యేక ప్రదర్శన, పెరిగిన టికెట్ ధరలు, రోజుకు 5 షోల అనుమతితో విడుదలపై ఆసక్తి మరింత పెరిగింది.






