ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా గట్టి బుద్ధి చెప్పినా పాకిస్తాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాద సంస్థలు తమ ధోరణిని మార్చుకోవడం లేదు. భారత్ చేపట్టిన దాడుల్లో లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) మురిడ్కే ప్రధాన కార్యాలయం, బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) కీలక కేంద్రాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ భారత వ్యతిరేక విషప్రచారాన్ని కొనసాగిస్తూ ఉగ్రవాదులు మరోసారి బెదిరింపులకు దిగారు.
తాజాగా లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ సయీద్ అబ్దుల్ రెహ్మాన్ నక్వీ లాహోర్‌లో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ, ఢిల్లీ, ఆగ్రా వంటి నగరాలపై దాడులు చేస్తామని హెచ్చరించాడు. అఖండ భారత్(India)ను ముక్కలు చేస్తామని, ఢిల్లీని వణికిస్తామని, ఆగ్రాను అగ్నికి ఆహుతి చేస్తామని, దక్కన్ ప్రాంతాన్ని తగలబెడతామని, కాశ్మీర్‌ను విముక్తి చేస్తామని ప్రగల్భాలు పలికాడు.
‘‘కాశ్మీర్ సాలిడారిటీ డే’’ (Kashmir Solidarity Day) సందర్భంగా పాక్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో భారతదేశంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. లష్కరే తోయిబాతో అనుబంధం ఉన్న పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నక్వీ, తన రాజకీయ పార్టీని కూడా ఉగ్రవాద భావజాలంతోనే ముందుకు తీసుకెళ్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, ఆయన కుమారుడు తల్హా సయీద్‌లకు నక్వీ అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
భారత్‌పై వరుస హెచ్చరికలతో పాక్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయన్న ఆందోళనలను ఈ పరిణామాలు మరింత పెంచుతున్నాయి.








