చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం పబ్లిసిటీ (Publicity)కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, వాస్తవ పనితీరును విస్మరిస్తోందని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పన్నుల రాబడిపై చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఏపీ పన్నుల (AP Tax) రాబడిలో దేశంలోనే 22వ స్థానానికి పడిపోయిందని, ఇది తీవ్రమైన ఆర్థిక మందగమనానికి నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కలే ఈ వాస్తవాన్ని స్పష్టంగా చూపుతున్నప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్‌డీపీ గణాంకాలతో (GSDP Statistics) ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న భ్రమను సృష్టించేందుకు తప్పుడు అంకెలను ప్రచారం చేస్తున్నారని అన్నారు.
2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 శాతమని, జాతీయ వృద్ధి రేటు 9.8 శాతమేనని ప్రభుత్వం ప్రకటించిందని, అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75 శాతమని చెబుతోందని గుర్తు చేశారు. ఈ లెక్కల ప్రకారం రెండేళ్ల సగటు వృద్ధి 11.09 శాతమని, దేశంలో మూడో స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఇవన్నీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కాదని, చంద్రబాబు కార్యాలయంలో తయారైన అంకెలేనని విమర్శించారు.
ఈ గణాంకాలు నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాల్సి ఉందని జగన్ స్పష్టం చేశారు. కానీ కాగ్ నివేదికల ప్రకారం గత రెండేళ్లలో ఏపీ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97 శాతమేనని వెల్లడించారు. జీఎస్‌డీపీ వృద్ధి 11 శాతం అని చెప్పుకుంటున్న రాష్ట్రం, పన్ను ఆదాయాల్లో మాత్రం ఇంత తక్కువ వృద్ధి సాధించడం అసాధారణమని అన్నారు.
23 రాష్ట్రాలతో పోలిస్తే పన్ను ఆదాయాల వృద్ధిలో ఏపీ చివర నుంచి రెండో స్థానంలో ఉందని, కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64 శాతం పెరిగినా, ఏపీ మాత్రం 1.97 శాతానికే పరిమితమైందని జగన్ విమర్శించారు. అయినా కేంద్రం కంటే మెరుగైన పనితీరు చూపుతున్నామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ మొదటి స్థానంలో ఉన్నవి అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపులు, తప్పుడు ప్రచారాలేనని దుయ్యబట్టారు.






