గన్నవరం విమానాశ్రయం (Gannavaram Airport) విస్తరణ కోసం భూములు (Lands), ప్లాట్లు ఇచ్చి పదేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల ఆవేదన మళ్లీ వెలుగులోకి వచ్చింది. రాజధాని ప్రాంతంలోని మందడంలో రైతుల వెల్ఫేర్ అసోసియేషన్ (Farmers Welfare Association) నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న విమానాశ్రయ బాధితులు తమ గోడును విలేకరుల ముందుంచారు.
గన్నవరం ప్రాంతంలోని మూడు లేఔట్‌లలో ఇళ్ల నిర్మాణం కోసం కొనుగోలు చేసిన సుమారు 500 ప్లాట్లు మరియు మరికొన్ని భూములను విమానాశ్రయం విస్తరణ నిమిత్తం ప్రభుత్వానికి అప్పగించామని వారు వివరించారు. అయితే పదేళ్లు గడిచినా తమకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించలేదని, రాజధాని ప్రాంతంలో ఇస్తామని హామీ ఇచ్చి అది కూడా అమలు కాలేదని తెలిపారు.
భూములు, స్థలాలు ఇచ్చిన వారిలో అనేకమంది ఇప్పటికే మరణించారని, ప్రస్తుతం తమ వయసులు 60-70 సంవత్సరాల మధ్య ఉన్నాయని, ఇక ఎప్పుడు ఇళ్లు నిర్మించుకుంటామనే ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఇల్లు నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నప్పటికీ ఇళ్లు మాత్రం లభించలేదని, అయితే రుణాలపై వడ్డీ భారం మాత్రం కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని రైతుల (Capital Farmers) సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ అయినా తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.






