తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) ఆస్థాన మీడియాగా పేరుగాంచిన ఆంధ్రజ్యోతిలో (Andhra Jyothi) వచ్చిన తాజా ‘కొత్తపలుకులు’ (Kotha Palukulu) వ్యాసం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా నారా లోకేష్ (Nara Lokesh) విదేశాల్లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లకు హాజరవడంపై, అలాగే ఆయన పక్కన తరచుగా కనిపిస్తున్న ఎంపీ సానా సతీష్ (Sana Satish) అంశంపై ఆర్కే (RK – Radha Krishna) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
ఇటీవల దుబాయ్, ముంబై, కొలంబోలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లకు లోకేష్ వెళ్లడం పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గారు విమర్శలు గుప్పించారు. ప్రజా బాధ్యతల్లో ఉన్న మంత్రి వ్యక్తిగత సరదాల కోసం విదేశాలకు వెళ్లడం సముచితం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విమర్శలకు స్పందించిన లోకేష్ తీరు మరింత చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో ఆర్కే తన విశ్లేషణలో ‘జగన్ చెప్పిన మాటల్లో పాయింట్ ఉందని’ పేర్కొనడం గమనార్హం. రాజకీయాల్లో ఉన్నవారు వ్యక్తిగత అలవాట్లు, సరదాలను పరిమితం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజలు నాయకులను వారి చుట్టూ ఉన్న వారిని బట్టి అంచనా వేస్తారనే వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని సూచించారు.
ప్రత్యేకంగా సానా సతీష్ పేరు పదే పదే ప్రస్తావించడం వెనుక రాజకీయ విశ్లేషకులు మరో కోణాన్ని చూపిస్తున్నారు. గతంలో ఆర్థిక వివాదాలు, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయన పేరు వినిపించిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తితో విదేశాల్లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం భవిష్యత్తులో రాజకీయ ఇమేజ్‌పై ప్రభావం చూపవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. క్రికెట్ విక్షించే నెపంతో వెళ్ళి అర్ధిక విషయాలు చక్కబెట్టుకుంటున్నారా అనే అనుమానం ప్రజలకి తట్టక ముందే జాగ్రత్త పడాలని ఆర్కే సూచిస్తునట్టు కనిపిస్తుందని పలువురి నుండి వినిపిస్తున్న మాట
క్రికెట్ మ్యాచ్‌లకు వెళ్లడంపై కంటే, ఆ సందర్భాల్లో బయటకు వచ్చిన ఫోటోలు, వాటి ద్వారా ప్రజల్లో సృష్టించబడే అభిప్రాయాలే ఎక్కువ నష్టం కలిగించవచ్చని ఆర్కే హెచ్చరించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజా జీవితంలో పారదర్శకత, జాగ్రత్త, మరియు రాజకీయ పరిపక్వత ఎంత కీలకమో ఈ పరిణామం మరోసారి స్పష్టంచేస్తోంది. మరి ఈ సంకేతాలను లోకేష్ ఎంతవరకు గ్రహిస్తారు? భవిష్యత్తులో తన ప్రజా ప్రతిష్టను కాపాడుకునే దిశగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాల్సి ఉంది.







