---Advertisement---

సాగునీటి ప్రాజెక్టుల ఘనత తమదే అంటున్న సీఎం చంద్రబాబు వాఖ్యల్లో నిజమెంత?

February 27, 2026

---Advertisement---

రాష్ట్ర అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై (Irrigation Projects) జరిగిన ప్రత్యేక చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ (TDP) మరియు ఎన్డీయే ప్రభుత్వాల (NDA Government) హయాంలోనే నిర్మించబడ్డాయని ఆయన పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. రాయలసీమ ప్రాంతంలోనూ తమ ప్రభుత్వ కాలంలోనే అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే 1995 నుండి 2004 వరకు ఆయన 9ఏళ్ళ పాలనలో సాగునీటి రంగానికి కేటాయించిన నిధులు కేవలం రూ. 10,392 కోట్ల 89 లక్షలకే పరిమితమయ్యాయని గణాంకాలు సూచిస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు, వరికపుడిసెల ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టులకు 1996 మార్చిలో పార్లమెంట్ ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేసినప్పటికీ, ఆ తర్వాతి తొమ్మిది సంవత్సరాల్లో శిలాఫలకాల స్థాయి దాటలేదనే విమర్శలు అప్పటి నుంచే వినిపిస్తున్నాయి.

దశాబ్దాల కలగా భావించబడిన పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ నిర్లక్ష్యం చూపినట్టుగా సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కడియం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావు (Vaddi Veerabhadra Rao) 2003లో ‘పొలవరం సాధన సమితి’ (Polavaram Sadhana Samithi) పేరిట తన స్వగ్రామమైన నరేంద్రపురం నుండి ఢిల్లీ వరకు సుమారు 3000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించినప్పటికీ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు గారు తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శల ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2004లో వడ్డి వీరభద్రరావుకు టికెట్ నిరాకరించడంతో పాటు పార్టీ లైన్ దాటినందుకు టీడీపీ నుండి సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రాయలసీమ అంశంలోనూ చంద్రబాబు గారి తీరుపై అనేక వివాదాలు తలెత్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచే చర్యలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు దేవినేను ఉమా చేత నిరసనలు జరిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జగన్ గారి పాలనలోనే సుమారు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన భాగాన్ని పూర్తి చేసే అవకాశమున్నప్పటికీ, తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి మాటల మేరకు ప్రాజెక్టు నిలిచిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నింటినీ పరిశీలించినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు గారి తీరుపై అనేక విమర్శలు ఉన్నాయనేది కాదనలేని సత్యం. ఎన్నికల సమయంలో శంకుస్థాపనలు చేసి, తరువాతి కాలంలో వాటి అమలులోకి తేకుండా వదిలేయడం, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకుని వెళ్ళి పూర్తి చేస్తే, ఆ ప్రాజెక్టుల ఘనత తమదే అని చెప్పుకోవడం చంద్రబాబుగారికి సాధారణ అంశంగా మారిందనే విమర్శలు ఈ మద్య కాలంలోనే అధికంగా వినిపిస్తున్నాయని పలువురు చెబుతున్న మాట. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో చేసిన ప్రకటనలపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో, నిపుణుల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో విస్తృత చర్చ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment