---Advertisement---

టీటీడీ పాల‌క‌మండ‌లి భేటీలో కీలక నిర్ణయాలు.. కొత్త పథకాలతో టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోదం

February 28, 2026

Summarize with AI

---Advertisement---

తిరుమల (Tirumala) అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం (TTD Board of Trustees Meeting) ముగిసింది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈవో, అదనపు ఈవో, బోర్డు సభ్యులు హాజరయ్యారు. మొత్తం 87 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యాలు, ఆధ్యాత్మిక సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్ (Budget) అంచనాలకు మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన ప్రమాణాల కోసం రూ.118.8 కోట్లు కేటాయించారు. భక్తుల విజ్ఞప్తి మేరకు “శ్రీవారి ముడుపు” (Srivari Mudupu) పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. నగదు రహిత కానుకల కోసం ప్రత్యేక “శ్రీవారి ముడుపు పథకం” అమలు చేయనున్నారు.

రూ.120 కోట్ల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో కొత్త వంటశాల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ నిర్మాణానికి రియ‌ల‌న్స్‌ సంస్థ ముందుకు రావడం విశేషం. అదేవిధంగా అలిపిరిలో భద్రతా చర్యల భాగంగా రూ.8 కోట్లతో బ్యాగేజ్ ఎక్స్-రే పరికరాలు కొనుగోలు చేయనున్నారు.

ఒంటిమిట్టలో (Ontimitta) 108 అడుగుల ఎత్తుతో జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒంటిమిట్ట కోదండ‌రామ ఆల‌య పరిసరాల్లో రూ.4.2 కోట్లతో విద్యుత్ దీపాల ఏర్పాటు చేపట్టనున్నారు. వకుళమాత ఆలయంలో “అక్షర గోవిందం” (Akshara Govindam) పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ.27.17 కోట్ల వ్యయంతో ఐల్యాండ్ నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేయనున్నారు.

గోశాల ఆధునీకరణ కోసం రూ.11.8 కోట్లు కేటాయించారు. 51 మంది పరిచారకులకు అర్చకులుగా ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై తిరుమలలో రీల్స్, అనవసర వీడియోలు చిత్రీకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండలి స్పష్టం చేసింది. భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment