ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా తార్లువాడలోని విలువైన భూమిని మరో సారి ఎకరాకు కేవలం రూపాయకే కేటాయించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం “ప్రత్యేక కేసు”గా పేర్కొంటూ ఏపీ సెమీ కండెక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024–29 కింద అడ్వాన్స్ సిస్టం ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 30 ఎకరాల విలువైన భూమిని అప్పగించింది.
ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ సంస్థ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద రూ.2,387.81 కోట్ల పెట్టుబడులు పెట్టి, సుమారు 1,000 మందికి ఉపాధి కల్పించనుందని చెబుతోంది. అయితే ఈ సంస్థ అసలు స్థితిగతులు అందుకు భిన్నంగా ఉండటం ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
అడ్వాన్స్ సిస్టం ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో స్థాపించబడిన ఒక చిన్న, లిస్టింగ్ కాని ప్రైవేట్ కంపెనీ అని. కంపెనీ షేర్ క్యాపిటల్ కేవలం రూ.30 కోట్లు మాత్రమే అని. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం రూ.1 కోటి కన్నా తక్కువగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయని. ఉద్యోగుల సంఖ్య కూడా 4 నుండి 10 మందికే పరిమితమని సమాచారం వెలుగులోకి వచ్చిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తన ఎక్స్ ఖాతా ద్వారా భయట పెట్టారు.
ఇలాంటి సంస్థను “గ్లోబల్ జెయింట్”గా ప్రొజెక్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని? ప్రజల ఆస్తిగా ఉన్న వేల కోట్ల విలువైన భూమిని ఎకరాకు రూపాయకే ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని? ఇది మరో బ్యాక్‌డోర్ ఒప్పందమా అని ఆయన ప్రభుత్వాన్ని నిలసీశారు.
ఈ కేటాయింపుపై పారదర్శకత, లాభదాయకత, భవిష్యత్ బాధ్యతలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు. పెట్టుబడుల పేరుతో ప్రజల ఆస్తులు అప్పగిస్తున్నారా? లేక నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలిక లాభం చేకూరే ప్రణాళికేనా? విశాఖ భూముల కేటాయింపు వెనుక నిజం ఏమిటో తెలియాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజల్లో చర్చ మొదలవ్వడం గమనార్హం.






