తిరుమల లడ్డూ ప్రసాదంలో (Tirumala Laddu Prasadam) జంతు అవశేషాలు (Animal Remains) కలిపారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సీబీఐ(CBI) తేల్చడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన డీఎస్పీ (DSP) దేవరకొండ నాగ వరప్రసాద్ (Devarakonda Naga Vara Prasad) తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌లపై (Nara Lokesh) ఫిర్యాదు చేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
తిరుమల లడ్డూ ప్రసాదం వంటి పవిత్ర అంశంపై జంతు అవశేషాల ఆరోపణలను పదేపదే ప్రస్తావిస్తూ జుగుప్సాకరమైన చర్చలు, డిబెట్లు నిర్వహించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని డీఎస్పీ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలను ప్రోత్సహిస్తూ చర్చలు నిర్వహించిన కొన్ని టెలివిజన్ చానెళ్ల యజమానులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించినట్లు సమాచారం.
ప్రస్తుతం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (Police Training College) ప్రిన్సిపాల్‌గా (Principal) విధులు నిర్వహిస్తున్న దేవరకొండ నాగ వరప్రసాద్, ప్రస్తుతం మెడికల్ లీవ్‌లో ఉన్నారని తెలిసింది. ఒక ప్రభుత్వ అధికారి స్వయంగా రాజకీయ ప్రముఖులపై ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తిరుమల లడ్డూ వివాదం ఇకపై ఏ దిశగా సాగుతుంది? అన్న ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.






