---Advertisement---

పవిత్ర పదవికి అర్హుడేనా? వరుస వివాదాల్లో బీఆర్ నాయుడు!

March 2, 2026

---Advertisement---

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేని బొల్లినేని రాజగోపాల్ నాయుడు (Bollineni Rajagopal Naidu) (బీఆర్ నాయుడు) పేరు ఇటీవలి కాలంలో వరుస వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఆయన, తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) వ్యవస్థీకృత మద్దతుదారుగా ఉన్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో సర్వసాధారణం. పార్టీకి అనుకూలంగా, ప్రత్యర్థులపై పరోక్ష విమర్శలు చేస్తూ మీడియా వేదికగా పోరాటం సాగించిన వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది.

చంద్రబాబు నాయుడుతో (Nara Chandrababu Naidu) సాన్నిహిత్యం, ప్రతిపక్ష దశలో వైసీపీ ప్రభుత్వంపై (YSRCP Government) సాగించిన మీడియా విమర్శల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి అప్పగించబడినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. అయితే ఆ పవిత్రమైన బాధ్యతకు ఆయన అర్హతపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి.

చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తిరుమలలో చోటుచేసుకున్న పలు ఘటనలు భక్తుల్లో ఆందోళన కలిగించాయి. దర్శనానికి వచ్చిన భక్తులకు క్యూ లైన్లలో ఎదురైన ఇబ్బందులు, పర్యవేక్షణ లోపాల ఆరోపణలు, కొన్నిచోట్ల అనుచిత ప్రవర్తన ఘటనలు ఇవన్నీ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తాయి. భక్తుల భద్రత, క్షేత్ర పవిత్రత కాపాడాల్సిన సమయంలో నిర్వహణలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి.

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక వీడియో మరింత వివాదానికి దారితీసింది. మొదట అది మార్ఫింగ్ వీడియో అని వివరణ ఇచ్చినా, అనంతరం ఆ మహిళ తమ కుటుంబ స్నేహితురాలు అని వెల్లడించడం కొత్త చర్చలకు కారణమైంది. పవిత్ర క్షేత్రానికి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ప్రవర్తనపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అదేవిధంగా గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో పవిత్ర ఏడుకొండలపై చేసిన వ్యాఖ్యలు, తాజాగా వేదాలు దెయ్యాలు అంటూ, భగవద్గీతలో (Bhagavad Gita) ఏమీ లేదంటూ ఆధ్యాత్మిక గ్రంథాలపై చేసిన వ్యాఖ్యానాలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి. తనకు ఈ పదవి జీవనోపాధి కాదని, వ్యాపారాలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు కూడా బాధ్యతా భావంపై సందేహాలను రేకెత్తించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇటువంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి తిరుమల వంటి అత్యంత పవిత్ర క్షేత్రానికి చైర్మన్‌గా కొనసాగడం సముచితమేనా అనే ప్రశ్న భక్తుల్లో కలిగిస్తోంది. ఈ వివాదాలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment