పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న ఘాఫ్–2 ఎర్త్ కోర్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ రూపకల్పనలో వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి భవిష్యత్తులో భద్రతాపరమైన ముప్పుకు దారితీయవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తున్నట్లు ఉండవల్లి తెలిపారు. పూర్తి సాంకేతిక మరియు డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యామ్ పటిష్టతకు, ప్రజల భద్రతకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
డ్యామ్ నిర్మాణం ప్రస్తుతం నది మట్టం కంటే సుమారు 7.18 మీటర్ల ఎత్తులో జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే డ్యామ్ కింద నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ కేవలం నీటి సీపేజీని అడ్డుకునే కట్-ఆఫ్ వాల్ మాత్రమేనని, అది డ్యామ్‌కు పునాదిగా పనిచేయదని వివరించారు. పునాది నిర్మాణంలో లోపాలు ఉంటే భవిష్యత్తులో ఇసుక కోతకు గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన లేఖలో సూచించారు.
అదేవిధంగా సరైన కారణం లేకుండా టెయిల్ వాటర్ లెవల్‌ను +25 మీటర్ల నుండి +16.0 / +13.5 మీటర్లకు మార్చడంపై సెంట్రల్ వాటర్ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఉండవల్లి పేర్కొన్నారు. అంతర్జాతీయ కన్సల్టెంట్ AFRY నుంచి రావాల్సిన ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ వంటి కీలక పత్రాలు ఇప్పటికీ సీడబ్ల్యూసీకి అందలేదని, ఈ పత్రాలు లేకుండా పనులు కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన విమర్శించారు.
అలాగే భూకంపాలను తట్టుకునే సామర్థ్యం విషయంలో పాత ప్రమాణాలు మరియు కొత్త ప్రమాణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని ఉండవల్లి సూచించారు. ఈ అంశాలను వెంటనే పరిగణలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన తన లేఖలో హెచ్చరించారు.






