ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఆదివారం జరిగిన ఓ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) పర్యటనకు ముందు నిర్వహించిన కాన్వాయ్ ట్రయల్ రన్ (Convoy Trial Run) సమయంలో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతుడిని అదే గ్రామానికి చెందిన అంకన్న (Ankanna) (25)గా గుర్తించారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పోలీసులు మరియు ఉన్నతాధికారులు ఆదివారం మధ్యాహ్నం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్వాయ్‌లోని ఒక వ్యాన్ అత్యంత వేగంగా రాంగ్ రూట్ (Wrong Route)లో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్లోకి ప్రవేశించిన ఆ వ్యాన్, అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న అంకన్నను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అంకన్న గాల్లోకి ఎగిరి కిందపడగా తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలోనే అతను ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో చిన్నగుడిపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనకు ముందు జరిగిన ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్ సమయంలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.






