తిరుమలలో (Tirumala) భక్తులు సమర్పించే బంగారం (Gold), వెండి (Silver) కానుకల భద్రతపై (Offerings Security) అనుమానాలు రేకెత్తించే ఘటన వెలుగులోకి వచ్చింది. పరకామణి విభాగంలో (Parakamani Department) పనిచేసే ఒక ఉద్యోగి భక్తులు సమర్పించిన విలువైన బంగారం, వెండి కానుకలను అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం గతంలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తిరుమలలో భక్తులు హుండీల్లో సమర్పించే నగదు, బంగారం, వెండి తదితర కానుకలను పరకామణి విభాగంలో లెక్కించి భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ అత్యంత కట్టుదిట్టంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ, తాజాగా బయటపడిన ఘటన భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ లెక్కింపు ప్రక్రియలోనే కొన్ని విలువైన వస్తువులు మాయమైనట్లు ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత వివాదాస్పదంగా మార్చింది.
నిఘా వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం, దాదాపు కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకలను ఒక ఉద్యోగి అక్రమంగా తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పరకామణి విభాగంలో పనిచేసే పెంచలయ్య (Penchalayya) అనే ఉద్యోగి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. భక్తులు సమర్పించిన బంగారు గొలుసులు, బ్రాస్లెట్, వెండి పాత్రలు మరియు ఇతర ఆభరణాలను అధికారిక లెక్కల్లో చూపకుండా బయటకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.
2025లో ఈ విషయంపై ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. అనంతరం లభించిన ఆధారాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా పెంచలయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు పలుమార్లు చోరీకి పాల్పడినట్లు వెల్లడైనట్లు సమాచారం.
దర్యాప్తు సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం, భక్తులు సమర్పించిన వివిధ రకాల బంగారు గొలుసులు, బ్రాస్లెట్, వెండి పాత్రలు మరియు ఇతర ఆభరణాలు ఈ చోరీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ వస్తువుల మొత్తం విలువ సుమారు 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, స్వల్ప కాలంలోనే అతను బెయిల్పై విడుదల కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ తరఫున న్యాయవాదుల వాదనల్లో బలం లోపించిందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక గతంలో జరిగిన మరో ఘటనను కూడా పలువురు గుర్తుచేస్తున్నారు. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో (YSR Congress Government) ఒక ఉద్యోగి కేవలం 76వేల విలువ కలిగిన అమెరికన్ డాలర్ల (American Dollars) చోరీ చేసిన ఘటనలో అతనికి చెందిన కోట్ల రూపాయల ఆస్తులను స్వామివారికి జప్తు చేసిన ఉదాహరణ ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరిగిన ఘటనలో కూడా స్వల్ప కాలంలోనే బెయిల్ లభించే పరిస్థితే ఉంటే గత పాలనలో చేసిన విధంగానే కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అప్పుడే పరకామణిలో ఉద్యోగం చేసే వారిలో చెడుబుద్ది కలగదని భక్తుల నుండి వినిపిస్తున్న మాట.
ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తిరుమలలో భక్తుల కానుకల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పరకామణి ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావాలని, సీసీటీవీ పర్యవేక్షణ గత ప్రభుత్వంలో కఠినతరం చేసినా అధికారుల అలసత్వం కనిపిస్తుందని ఈ నేపధ్యంలో భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా మరింత అప్రమత్తంగా ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.






