---Advertisement---

నాటకాలకి ఉన్న సమయం కల్తీ పాల బాధితులని పట్టించుకోవడానికి లేదా? – మార్గాని భరత్

March 10, 2026

---Advertisement---

రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనపై రాజకీయ వాదనలు మరింత వేడెక్కుతున్నాయి. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకుని వైద్యులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

రాజమండ్రిలో కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉందని మార్గాని భరత్ ఆరోపించారు. నాటకాలు వేయడానికి సమయం ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్య కుమార్ వంటి నేతలు కల్తీ పాల బాధితుల పరిస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఘటనను యాక్సిడెంట్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.

బాధితుల శాంపిళ్లను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఎందుకు పంపలేదని ప్రశ్నించిన భరత్, ఈ ఘటనపై పూర్తి స్థాయి నిజానిజాలు వెలుగులోకి రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు.

160 లీటర్ల పాలు తీసుకొచ్చినా కేవలం 20 కుటుంబాలే ఎందుకు ప్రభావితమయ్యాయనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు. పాలలో యూరియా కలిసిందా, ఫార్మాలిన్ కలిసిందా, లేక గిట్టని వ్యక్తులు పురుగుల మందు కలిపారా అనే అంశాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోవడం ఆందోళనకరమని అన్నారు.

బాధిత కుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, చిన్నారులు సైతం ప్రాణాల కోసం పోరాడుతున్నారని భరత్ తెలిపారు. ఈ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో వైఎస్ జగన్ మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేసిన ఆయన, ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

పురుగుల మందు తీసుకున్నప్పుడు ఎదురయ్యే తీవ్ర అనారోగ్య లక్షణాల్లాంటి పరిస్థితులు బాధితుల్లో కనిపిస్తున్నాయని అన్నారు. ల్యాబ్ రిపోర్టులు రావడానికి వారాల సమయం ఎందుకు పడుతోందని కూడా ఆయన ప్రశ్నించారు.

ఈ ఘటన తర్వాత హెరిటేజ్ సంస్థ ప్రకటనలు విపరీతంగా పెరగడం అనుమానాలకు తావిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనను కూడా వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కల్తీగా మారుతున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు.

చంద్రబాబు హయాంలో తిరుమల లడ్డుకు సంబంధించిన ఘీ ఫ్లేవర్ ఎన్‌హ్యాన్సర్ల కొనుగోలు కూడా వివాదాస్పదమని పేర్కొన్నారు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు కనీసం 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా తెలిపారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులను తనికీల గురించి ప్రశ్నిస్తే సిబ్బంది లేరని చెప్పడం దారుణమని మార్గాని భరత్ మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment