ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) ప్రాముఖ్యతపై చర్చ చెలరేగింది. కూటమి ప్రభుత్వం (Alliance Government) ఇప్పటికే మూడు బడ్జెట్‌లను ప్రవేశపెట్టగా, దాదాపు 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబడినప్పటికీ, ఈ సమావేశాల తర్వాత ప్రజలకు నిజంగా ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న తీవ్రంగా వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తన ప్రెస్‌మీట్‌లో బడ్జెట్‌లో వాస్తవాల కంటే మోసపూరిత అంచనాలు, కల్పిత లెక్కలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి (State Financial Condition) తీవ్రంగా దెబ్బతిన్నదని కాగ్ నివేదిక (CAG Report) కూడా స్పష్టం చేసిందని, ఇది కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ముందు “సూపర్ సిక్స్” (Super Six) పేరుతో కూటమి నేతలు ఇచ్చిన హామీలపై కూడా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తల్లికి వందనం (Talliki Vandanam Scheme), అన్నదాత సుఖిభవ (Annadata Sukhibhava Scheme), పెన్షన్ పథకాలలో కోతలు విధించడంతో పాటు ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి వంటి పథకాలు పూర్తిగా అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ప్రతి సంవత్సరం ప్రకటిస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ గురించిన మాట కూడా వినిపించకపోవడం వల్ల యువతలో తీవ్ర నిరాశ నెలకొందని గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా, పరిపాలన గాడి తప్పిందన్న విమర్శలు వస్తున్నా, అసెంబ్లీలో మాత్రం నేతల మధ్య పరస్పర ప్రశంసలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్(Nara Lokesh), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒకరినొకరు పొగడుకుంటూ సభను ఆత్మస్తుతి, పరనిందల వేదికగా మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిజంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో మరింతగా చర్చకు దారితీస్తోంది.






