ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (Andhra Pradesh Government) ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం (Komati Jayaram) అభినందన సభ విజయవాడ సమీపంలోని పోరంకి మురళీ రిసార్టులో (Murali Resort) జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణతో (Justice N. V. Ramana) పాటు కూటమి ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ సభలో జస్టిస్ ఎన్.వి. రమణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
కార్యక్రమంలో మాట్లాడుతూ జస్టిస్ ఎన్.వి. రమణ కోమటి జయరాం కష్టానికి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న తన స్నేహాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో (Telugu Desam Party) జయరాంకు ప్రత్యేక అనుబంధం ఉందని, అమరావతి రాజధాని (Amaravati Capital City) కోసం రైతులు ఉద్యమం (Farmers Protest Movement) చేస్తున్న సమయంలో వారికి అనేక విధాలుగా సహాయం అందించారని చెప్పారు. రాజధాని ఉద్యమానికి న్యాయ సహాయం అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) అరెస్టు జరిగిన సమయంలో జయరాం తీవ్రంగా బాధపడ్డారని, పెమ్మసాని తో కలిసి వచ్చి న్యాయ సలహాలపై చర్చలు జరిపారని కూడా ఆయన వెల్లడించారు. ఇటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నానని జస్టిస్ రమణ అన్నారు.
అయితే జస్టిస్ ఎన్.వి. రమణ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి దారితీశాయి. ఒక మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ప్రజాస్వామ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోమటి జయరాం లాంటి వ్యక్తిని ప్రశంసించడం సరైనదేనా అనే ప్రశ్నలు పలువురు లేవనెత్తుతున్నారు. ఇది మాజీ న్యాయమూర్తి నైతికతను ప్రశ్నించేలా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో 2024 ఎన్నికల సమయంలో జరిగిన ఒక సభలో కోమటి జయరాం ఓటర్లను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను “వేదవలు” అంటూ విమర్శించడమే కాకుండా, వారి కుటుంబ అవసరాలను బట్టి అవసరమైతే రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనేయాలని వ్యాఖ్యానించిన విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.
అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ “మంచి వ్యక్తి”గా అభివర్ణించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ రమణ నైతికతపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలకు ఆయన ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.






