ఒకవైపు కల్తీ మద్యం ఘటనలు, మరోవైపు మహిళలపై లైంగిక వేధింపుల (Sexual Harassment Allegations) ఆరోపణలతో ఇప్పటికే విమర్శల పాలవుతున్న అధికార తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party – TDP) మరో వివాదం తలెత్తింది. ఈసారి ఏకంగా డ్రగ్స్ వినియోగం ఆరోపణల (Drug Consumption Allegations)తో ఏలూరు ఎంపీ పేరు (Eluru MP) బయటకు రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ సమీపంలోని మోయినాబాద్‌లో ఉన్న ఓ ఫార్మ్ హౌస్‌లో అనుమతి లేకుండా పార్టీ జరుగుతుందన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ సమాచారంతో పోలీసులు రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో అక్కడికి చేరుకుని ఆకస్మికంగా దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ (Namit Sharma) తుపాకీతో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆ తుపాకీ రోహిత్ రెడ్డి (Rohit Reddy) తమ్ముడు రితేష్ రెడ్డికి (Ritesh Reddy) చెందినదిగా గుర్తించారు.
పోలీసుల తనిఖీలో అక్కడ రెండు గ్రాముల తెల్ల పొడి (డ్రగ్స్) స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడ మొత్తం 10 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ (Putta Mahesh Kumar), రితేష్ రెడ్డి, నమిత్ మిశ్రా, ఎం. రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, రవి, అర్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు.
వీరిలో ఐదుగురికి మొదటి దశ డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు చెవెల్లా డీసీపీ యోగేష్ గౌతమ్ (Yogesh Gautam) వెల్లడించారు. అనంతరం రక్త నమూనాలు సేకరించి ఆసుపత్రికి పంపగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి కూడా డ్రగ్స్ వినియోగం ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం ఆరుగురు డ్రగ్స్ వినియోగించినట్లు నిర్ధారణ అయిందని ఈగిల్ ఫోర్స్ ఎస్పీ ఆర్. గిరిధర్ తెలిపారు.
ఇందులో మాజీ ఎమ్మెల్యేతో పాటు ఒక ప్రస్తుత ఎంపీ కూడా ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. రక్త నమూనాల పూర్తి నివేదికలు వచ్చిన తరువాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఇప్పటికే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఘటన ఇంకా చర్చనీయాంశంగా ఉండగానే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రస్తుత ఎంపీ కూడా డ్రగ్స్ కేసులో బయటపడటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాప్రతినిధులు ఇలాంటి ఘటనల్లో చిక్కుకోవడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దేశవ్యాప్తంగా దెబ్బతింటోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సంబంధిత ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలంటే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తప్పనిసరిగా ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు.






