పల్నాడు జిల్లా (Palnadu district) రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) బెయిల్పై (Bail) విడుదల కావడంతో పరిస్థితులు వేడెక్కాయి. వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తూ, కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శిస్తోంది.
మాచర్ల (Macherla) అర్బన్ పోలీస్ స్టేషన్ (Urban Police Station) హౌస్ ఆఫీసర్ నివేదిక ప్రకారం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై విడుదలైన సందర్భంలో వైసీపీ అనుచరులు భారీగా గుమిగూడే అవకాశం ఉందని, దీని వల్ల శాంతిభద్రతలకు భంగం కలగవచ్చని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, మాచర్ల తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బి. కిరణ్ కుమార్ (B. Kiran Kumar), సెక్షన్ 163 BNSS (144 Cr.PC) కింద ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 18, 2026 వరకు మాచర్ల పట్టణంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు.
అయితే వైసీపీ వర్గాల ప్రకారం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు (Cases) నమోదు చేసి ఇప్పటికే 98 రోజుల పాటు జైలులో ఉంచారని, ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆయనను ప్రజలు కలవకుండా నిరోధించేందుకు 144 సెక్షన్ విధించారని ఆరోపిస్తున్నారు. ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ప్రభుత్వం భయపడుతోందని, ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాల భాగమేనని పేర్కొంటున్నారు.
మరోవైపు, ఈ నిర్ణయం మతపరమైన వేడుకలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు, ఈస్టర్ ప్రార్థనల కోసం క్రైస్తవులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాగే మాచర్లలో జరిగే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్లకు (Sri Lakshmi Chennakesava Swamy Festival) వచ్చే లక్షలాది భక్తులు కూడా కష్టాలు పడతారని వైసీపీ ప్రశ్నిస్తోంది.






