---Advertisement---

అమరావతిలో నిర్మాణాల ఖర్చులు షాక్‌కు గురిచేస్తున్నాయా?

March 23, 2026

---Advertisement---

రాజధాని అమరావతిలో (Amaravati) జరుగుతున్న శాశ్వత భవనాల (Buildings) నిర్మాణాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా హైకోర్టు (High Court), అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయాలు భారీగా పెరుగుతుండటం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వం తాజా నిర్ణయాల ప్రకారం హైకోర్టు భవనానికి అదనంగా రూ.556 కోట్లను, అసెంబ్లీ భవనానికి రూ.424.34 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే కాంట్రాక్టుల రూపంలో భారీగా ఖర్చులు కేటాయించిన నేపథ్యంలో ఈ కొత్త నిధులు మొత్తం వ్యయాన్ని మరింత పెంచాయి.

దీంతో హైకోర్టు భవన నిర్మాణ ఖర్చు రూ.1,480.69 కోట్లకు చేరగా, అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లకు పెరిగింది. చదరపు అడుగుకు ఖర్చు కూడా గణనీయంగా పెరిగి అసెంబ్లీకి రూ.10,244.07, హైకోర్టుకు రూ.7,286.03గా నమోదైంది. ఈ స్థాయి ఖర్చులు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా అరుదుగా కనిపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad), చెన్నై (Chennai) వంటి మహానగరాల్లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన నిర్మాణాలు కూడా చదరపు అడుగుకు రూ.4,000 లోపే పూర్తవుతుండగా, అమరావతిలో ఖర్చులు రెండింతలు, మూడింతలు ఎక్కువగా ఉండటం ఆర్థిక నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించింది. మొదట చదరపు అడుగుకు రూ.3,350గా అంచనా వేసిన వ్యయం చివరికి రూ.19,183కి పెరిగింది. ఈ అనుభవం దృష్ట్యా ప్రస్తుతం జరుగుతున్న శాశ్వత భవనాల ఖర్చులు పూర్తయ్యేసరికి మరింత పెరిగే అవకాశాలపై అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఈ వ్యయాల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. అధిక వడ్డీలతో దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకుంటూ భారీ ప్రాజెక్టులు చేపట్టడం భవిష్యత్‌లో ఆర్థిక భారాన్ని పెంచే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. కాగ్ నివేదికల(CAG Report) ప్రకారం సంవత్సరంలో ఎక్కువ రోజులు ప్రభుత్వం అప్పులపై ఆధారపడుతున్న పరిస్థితి ఈ వ్యయాలను మరింత సున్నితమైన అంశంగా మార్చింది.

మరో వైపు గత ప్రభుత్వ కాలంలో చేపట్టిన రుషికొండ భవనాలు లాంటి నిర్మాణాలతో పోలిస్తే ప్రస్తుత వ్యయాలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం అభివృద్ధి దిశగా సాగుతోందా? లేక ఆర్థిక భారాన్ని పెంచుతోందా? అన్న ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment