వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్‌ను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాల భాగంగా తనకు మరియు తన కుమార్తె చెరుకూరి వెంకాయమ్మకు చెందిన ఐదు సెంట్ల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆమె ఆరోపించారు.
తమ సమస్యపై న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ సరైన స్పందన లభించలేదని, కారుణ్య మరణానికి కూడా అనుమతి ఇవ్వాలని కోరే స్థితికి వచ్చామని బాధితులు వాపోయారు. అమరావతి రాయపూడి గ్రామంలో భూమిని తీసుకుని నిబంధనల పేరుతో నివాస స్థలం ఇవ్వకుండా టిడిఆర్ బాండ్ ఇస్తామని చెప్పడం అమానుషమని వారు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో తమకు నివాస స్థలం లేదా ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
ఇదే సమయంలో, కోర్టులో సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది ‘5 సెంట్ల భూమికి బదులుగా మరోచోట భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు. అయితే, భూమి సేకరణ సమయంలో అధికారులు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారని శేషగిరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.
తనకు న్యాయం కోసం రెవెన్యూ మరియు సీఆర్‌డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఆమెకు, న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్ కూడా హాజరయ్యారు.






